ప్రముఖ నటుడు నరేష్ వీకే, పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, చాలామంది ఇది ఫేక్ కావచ్చనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం నరేష్, ఆయన మూడో భార్య మధ్య విడాకుల కేసు నడుస్తోంది. అయితే, అది కొలిక్కి వచ్చిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. ఒక వేళ వారి కేసు కోర్టులో ఉన్నట్లయితే నరేష్, పవిత్రా లోకేష్‌ల పెళ్లి చెల్లకపోవచ్చు. ఈ నేపథ్యంలో నరేష్ కావాలనే ఈ వీడియో వదిలారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


నరేష్ పోస్ట్ చేసిన వీడియోను బాగా గమనిస్తే.. అది నిజమైనా పెళ్లిలా లేదు. పైగా ఆ వీడియోలో ఉన్నవారు కూడా బంధువుల్లా లేరు. ఏదో ఒక స్టూడియో సెట్టింగ్‌లో పెళ్లి చేసినట్లుగా విజువల్స్ కనిపిస్తున్నాయి. దీంతో ఇది ఏదైనా ప్రకటన కోసం కూడా కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే నరేష్ చేసిన ట్వీట్ కూడా అంత స్పష్టంగా లేదు. ఒక వేళ ఆయన మూడో భార్య రమ్య కోర్టులో ఈ పెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తే.. నరేష్ ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 


ఆ సినిమాలో సీన్‌నే ఇలా షేర్ చేశారా?


నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్నది ఓ సినిమా కోసమనే సమాచారం కూడా చక్కర్లు కొడుతోంది. ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో వాళ్ళిద్దరూ జంటగా నటిస్తున్నారు. అందులో భాగంగానే వీరిద్దరిపై పెళ్లి సీన్ చిత్రీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై నరేష్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 


ఈ వీడియో కోర్టులో చెల్లదా?


నరేష్, పవిత్ర.. ఇద్దరూ నటీనటులే. కాబట్టి, వృత్తిలో భాగంగా ఇలాంటి సీన్లలో నటించడం సర్వ సాధారణమే. పైగా వీరు టాలీవుడ్‌లో పాపులర్ లవ్ బర్డ్స్. ఈ నేపథ్యంలో ప్రకటన సంస్థలు కూడా వీరి జోడి తమ ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఒక వేళ రమ్య కోర్టులో ఈ వీడియోను చూపించి ఆరోపణలు చేయాలన్నా కష్టమే. కేవలం నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్నట్లు ధృవీకరించే మ్యారెజ్ సర్టిఫికెట్ చూపించగలిగితేనే కోర్టు కూడా నమ్ముతుంది. అందుకే, నరేష్ ఇలా గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి సీన్ క్రియేట్ చేసి.. శాంపిల్‌గా ఈ వీడియో వదిలి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


ప్రకటన ఒకే, పెళ్లే డౌట్


టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు నరేష్-పవిత్ర లోకేష్‌ల రిలేషన్ వ్యవహారం గత కొన్నాళ్లుగా హాట్‌ టాపిక్‌గా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నట్లు డిసెంబర్ 31వ తేదీన అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఇద్దరూ లిప్ లాక్ చేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటూ రిలీజ్ చేసిన వీడియో వైరల్ అయింది. దీనిపై ఇంటర్నెట్ లో అనేక చర్చలు నడిచాయి. ఆ తర్వాత నరేష్, పవిత్ర పెళ్లి మీద ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. అయితే, శుక్రవారం విడుదల చేసిన వీడియో చూసిన తర్వాత అంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఎలాంటి హడావిడి లేకుండా నరేష్ పెళ్లి చేసుకోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. తన పెళ్లి గురించి ముందుగా లీక్ చేస్తే రమ్య నుంచి ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే అలా చేసి ఉండొచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మీరు కూడా ఈ వీడియోను చూసే ఉంటారు. మరి, మీ అభిప్రాయం ఏమిటీ? 






Also Read: పెళ్లి చేసుకున్న నరేష్, పవిత్ర లోకేష్ - వీడియో వదిలిన కొత్త జంట