Tirupati News : వకుళ మాత ఆలయ మహాసంప్రోక్షణకు సీఎం జగన్ ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి ఆహ్వానించారు. తిరుపతి సమీపంలోని పాతకాల్వ (పేరూరు బండ వద్ద)లో నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణకు హాజరు కావాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి ఆహ్వానించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి కలిసి ముఖ్యమంత్రికి స్వామివారి ప్రసాదాలు అందించి, శాలువతో సన్మానించారు. వేద పండితులు సీఎంకు వేద ఆశీర్వాదం చేశారు. జూన్ 18వ తేదీ నుంచి వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. జూన్ 23వ తేదీ మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
వకుళామాత ఆలయంలో శాస్త్రోక్తంగా క్షీరాధివాసం
తిరుపతి సమీపంలోని పాతకాల్వలో టీటీడీ నిర్మించిన వకుళామాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఉదయం క్షీరాధివాసం నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్నిప్రణయనం, కలశారాధన, ఉక్తహోమాలు, నవకలశ స్నపన క్షీరాధివాసం నిర్వహించారు. అమ్మవారి విగ్రహానికి వేద మంత్రాల మధ్య పాలతో విశేషంగా అభిషేకం చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు కలశారాధన, విశేష హోమాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో గుణ భూషణ్ రెడ్డి, ఆగమ సలహాదారు వేదాంతం విష్ణు భట్టాచార్యులు, ఇతర అధికారులు, రుత్వికులు పాల్గొన్నారు.
వకుళ మాత ఆలయం
తిరుపతికి 5 కిలోమీటర్ల దూరంలో పాతకాల్వ పేరూరు బండపై వకుళమాత ఆలయం ఉంది. సుమారు 320 ఏళ్ల క్రితం హైదర్ అలీ దండయాత్రల్లో ఈ ఆలయం దెబ్బతింది. ఇందులోని విగ్రహం కూడా కనిపించకుండా పోయింది. ఈ ఆలయం చుట్టూ కొండను మైనింగ్ మాఫియా కొల్లగొట్టింది. వందల ఏళ్ల పాటు ఎంతో వైభవంగా పూజలు అందుకున్న ఆలయం పూర్తిగా పాడైపోయింది. ఈ ఆలయానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు మంత్రి పెద్దిరెడ్డి చొరవ చూపారు. ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా పునర్మించారు. ప్రస్తుతం ఆలయ మహాసంప్రోక్షణ పనులు జరుగుతున్నాయి. జూన్ 23న ఆలయాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఆలయానికి పూర్వ వైభవం వచ్చే విధంగా ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు.