Satyavedu News : తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో మద్యం సేవించి 108 అంబులెన్సు నడుపుతున్న డ్రైవర్ ను పోలీసులు నిర్లక్ష్యంగా వదిలేసిన సంఘటన చోటు చేసుకుంది. ప్రజల ప్రాణాలు కాపాడవలసిన అంబులెన్స్ డ్రైవరే మద్యం సేవించి వాహనం నడపడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.  సత్యవేడు మండలం కన్నావరం గ్రామానికి చెందిన మోడీ చంద్రయ్య డయాలసిస్ పేషంట్ ....రోగిని 108 లో తిరుపతికి తీసుకెళ్లే క్రమంలో 108 డ్రైవర్ గోపినాథ్ మద్యం సేవించి  నడుపుతున్నారని మీడియాకు సమాచారం అందడంతో వారు వరదయ్యపాళెం పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు  మార్గమధ్యలో  వాహనాన్ని ఆపి డ్రైవర్ కి బ్రీతింగ్ మిషన్ పెట్టి చెక్ చేశారు. డ్రైవర్ మద్యం సేవించాడని, బ్రీతింగ్ మిషన్ లో 41.5 పాయింట్లుగా నిర్ధారించారు. వచ్చింది 41.5 పాయింట్లే కదా...పైగా డ్రైవర్ నిన్న మద్యం తీసుకున్నారు కావున ప్రమాదం ఏంలేదని సమర్థించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం తాగి వాహనం నడపడమే నేరంగా భావించే పోలీసులు పైగా 108 వాహనం డ్రైవర్ కు సడలింపు ఇచ్చారు. వరదయ్యపాలెంలో 108 వాహనం ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే వరదయ్యపాలెం ఎస్ ఐ నాగార్జున రెడ్డి నిర్లక్ష్యంగా అదే వాహనాన్ని తిరుపతి వరకు పంపించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉదయం 5 గంటల నుంచి రోగి కుటుంబ సభ్యులు 108 వాహనానికి ఫోన్ చేస్తూనే ఉన్నా 9 గంటల వరకు స్పందనే లేదని....తీరిగ్గా మద్యం సేవించిన డ్రైవర్ ను 108 వాహనాన్ని పంపడంపై రోగి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.