Atchannaidu Arrest : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును వెంటనే అరెస్ట్ చేయాలని ఏపీ పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్  ట్రెజరర్ సోమశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై స్పందించారు. అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా కుప్పం పీఎస్ లో ఐపీసీ సెక్షన్ 153 కింద కేసు నమోదు చేశామన్నారు. పోలీసుల ఆత్మస్థైర్యం, మనోభావాలను అవమానించేలా అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారని, అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు దురదృష్టకరం అన్నారు. పోలీసుల పట్ల చులకన వ్యాఖ్యలు చేయడం రాజకీయ నేతలకు పరిపాటైందని, రాజకీయాల కోసం పోలీసులను నోటి దురుసుగా ఇష్టానుసారం మాట్లాడితే స్వతంత్రంగా ప్రజల్లో తిరిగే రోజులు ఉండవని సోమశేఖర్ హెచ్చరించారు. పోలీసులు తలచుకుంటే రాజకీయ పార్టీల నేతలు స్వేచ్ఛగా రోడ్ల మీద తిరగలేరని ఆ విషయం అచ్చెన్నాయుడు గుర్తుపెట్టుకోవాలని కోరారు. తీరు మార్చుకోకపోతే భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు. పోలీసులకు, మహిళలకు అచ్చెన్నాయుడు బహిరంగ క్షమాపణలు చెప్పాలని సోమశేఖర్ డిమాండ్ చేశారు. 


అచ్చెన్నపై కేసు నమోదు 


కుప్పం సభలో రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ అచ్చెన్నాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  శు బహిరంగ సభలో ప్రసంగించిన అచ్చెన్నాయుడు... పోలీసుల్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. పోలీసుల మనోభావాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడారంటూ కుప్పం ఒన్ టౌన్ ఎస్సై రవి కుమార్ ఈ మేరకు  కుప్పం పోలీసు స్టేషన్ లో అచ్చెన్నాయుడు పైన కేసు నమోదు చేశారు.  పాదయాత్ర భద్రతకు ఐదు  వందల మంది వచ్చారని అయినా వారు తినడానికే వచ్చినట్లుగా వ్యవహరించారు కానీ.. ఎవరూ విధులు నిర్వహించలేదని భద్రత కల్పించలేదని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 


అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల ఖండించిన పేర్ని నాని 


అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని బహిరంగసభ అయిపోయిన తర్వాత విమర్శలు గుప్పించారు. పోలీస్‌ గన్‌మెన్ల భద్రతతో బతికే మీరు.. పోలీసుల గురించి ఇంత అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు.. పోలీసులను కించపరుస్తూ.. నిర్లజ్జగా మాట్లాడే వారిని ఏమనాలి? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఇటువంటి వారు ఆ పార్టీ అధ్యక్షులు అయితే.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడే చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే.. మీ తొలు ఒలిచి.. పొలీసులకు 'షూ' తయారు చేయిస్తానని పేర్ని నాని ఘటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఘాటు విమర్శలు చేసిన తర్వాత రోజే ..  ఎస్ఐ రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 


 పోలీసులపై అలా మాట్లాడడం బాధ కలిగించింది- మంత్రి అప్పలరాజు
 
అచ్చెన్నాయుడిపై కేసు నమోదు చేయడాన్ని మంత్రి అప్పలరాజు సమర్థించారు. అచ్చెన్నాయుడు సిక్కోలు వాసి అయి ఉండి.. పోలీసులపై అలా మాట్లాడటం  బాధకలిగించిందన్న ఆయన.. పోలీసులు సరిగ్గా గమనిస్తే అచ్చెన్నాయుడు పిర్రలు పగలగొట్టొచ్చని హెచ్చరించారు.  రాబోయే రోజుల్లో అచ్చెన్నాయుడును ప్రజలే మట్టి కరిపిస్తారని హెచ్చరించారు. గతంలోనూ పోలీసులుపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. పోలీసులపై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్‌సీపీ నేతలు, మంత్రులు ఖండించారు.