BJYM Protest : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ బీజేవైఎం నాయకులు చేపట్టిన డీజీపీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.  డీజీపీ ఆఫీస్ లోకి వెళ్లేందుకు యత్నించిన బీజేవైఎం నాయకులను పోలీసులు బలవంతంగా తరలించారు. దీంతో పోలీసులకు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఉద్రిక్తతలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్  స్పృహ తప్పిపడిపోయారు. ఈ సంఘటనలో భాను ప్రకాశ్ కు గాయాలయ్యాయి. వెంటనే బీజేవైఎం నాయకులు ఆయనను గ్లోబెల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఎమర్జెన్సీ వార్డుకు భాను ప్రకాశ్ తరలించి  వైద్య చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనలో భాను ప్రకాశ్ తోపాటు అరుణ్ కుమార్, పుల్లెల శివ సహా పలువురికి గాయాలయ్యాయి. 






బండి సంజయ్ ఆరా 


కరీంనగర్ పర్యటనలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ విషయం తెలుసుకున్న వెంటనే బీజేవైఎం నాయకులకు ఫోన్ చేసి భాను ప్రకాశ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలో లక్షలాది మంది అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ఆందోళన చేస్తే అమానుషంగా వ్యవహరిస్తారా? అంటూ మండిపడ్డారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించడం చేతగాని కేసీఆర్  సర్కార్ ప్రశ్నించే వాళ్లను అణిచివేయడానికి యత్నిస్తోందన్నారు.  కేసీఆర్ సర్కార్ కు పోయేకాలం దాపురించిందని, నిరుద్యోగుల ఉసరు తగలక తప్పదన్నారు.  బీజేవైఎం నాయకులపై విచక్షణారహితంగా లాఠీ ఛార్జ్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. 


డీజీపీ ఆఫీస్ ముట్టడి 


ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని బీజేవైఎం నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ఏకంగా డీజీపీ ఆఫీస్ లోపటికి చొచ్చుకొని వెళ్లారు బీజేవైఎం నేతలు. ఒకేసారి పెద్ద ఎత్తున బీజేవైఎం నేతలు కార్యాలయంలోకి  రావడంతో డీజీపీ ఆఫీస్ పోలీస్ భద్రత సిబ్బంది కంట్రోల్ చేయలేకపోయారు. అనంతరం భారీగా పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న నేతలను అరెస్టు చేశారు. ఎస్సై కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎస్సై పరీక్షలో తొమ్మిది మార్కులు, కానిస్టేబుల్ పరీక్షలో ఏడు మార్కులను కలపాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేశారు. దీంతో దాదాపు రెండు లక్షల మంది వరకు ఈవెంట్స్ కు అర్హతన సాధిస్తారని  బీజేవైఎం నేతలు తెలిపారు. ఆ మార్కులు కలిపితే మరోసారి ఈవెంట్స్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. లాంగ్ జంప్ నాలుగు మీటర్ల నుంచి 3.8 మీటర్లకు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. 1500 మీటర్లు ఉన్న పరుగు పందాన్ని 800 మీటర్లకు తగ్గించాలన్నారు.