Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసు అధికారికంగా సీబీఐ కోర్టుకు బదిలీ అయింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ ప్రక్రియ సీబీఐ కోర్టు ప్రారంభించింది. వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన, అనుబంధ ఛార్జ్ షీట్ విచారణకు స్వీకరించింది. వైఎస్ వివేకా హత్య కేసుకు SC/01/2023 నంబరు కేటాయించింది. హత్య కేసులో ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది. ఎర్ర గంగిరెడ్డి, వై.సునీల్ యాదవ్, జి.ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరి, డి.శివశంకర్ రెడ్డికి ఈ సమన్లు వెళ్లాయి. వీరిలో నలుగురు జైల్లో ఉండగా.. ఒక్క ఎర్ర గంగిరెడ్డి మాత్రం బెయిల్ పై ఉన్నారు. ఆయన బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఫిబ్రవరి 10న విచారణకు హాజరు కావాలని నిందితులను ఆదేశించింది.
మూడు రోజుల క్రితమే సీబీఐ కోర్టుకు చేరుకున్న ఫైళ్లు
వివేకా హత్య కేసు ఫైళ్లు, చార్జిషీటు పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర కీలక డాక్యుమెంట్లు నాలుగు రోజుల కిందట హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు చేరుకున్నాయి. వీటిని డప జిల్లా సెషన్స్ కోర్టు నుంచి హైదరాబాద్ తరలించారు. మూడు పెట్టెల్లో వీటిని హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తీసుకువచ్చారు. వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ కడప కోర్టులో ఐదుగురు నిందితులపై రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది. ఇప్పుడవన్నీ బదిలీ అయిన క్రమంలో హైదరాబాదులోని సీబీఐ న్యాయస్థానం త్వరలోనే వివేకా హత్య కేసు విచారణను ప్రారంభించింది.
ఏపీలో విచారణ ఆలస్యం అవుతోందని.. బెదిరింపులు వస్తున్నాయని వివేకా కుమార్తె పిటిషన్‌తో హైదరాబాద్‌కు మార్పు
ఏపీలో మూడేళ్ల క్రితం తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ అధికారులకు స్ధానిక పోలీసుల నుంచి ఎదురవుతున్న సవాళ్లు, రాజకీయ బెదిరింపులు వంటి కారణాలతో దర్యాప్తు నత్తనడకన సాగింది. తన తండ్రి హత్య కేసు దర్యాప్తును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై దర్యాప్తు జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏపీ నుంచి ఈ కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేసింది.ఈ కేసును ఇప్పటివరకూ ఏపీలో కడప, పులివెందులకోర్టులతో పాటు హైకోర్టు కూడా పర్యవేక్షిస్తోంది.
ఐదుగురు నిందితులకు సమన్లు జారీ
ఈ కేసులో నిందితులతో పాటు అప్రూవర్ గా మారిన దస్తగిరికి కూడా భద్రత లేకుండా పోయిందన్న విమర్శలు వచ్చాయి. దస్తగిరి పలుమార్లు ఇదే విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న ఈ కేసు దర్యాప్తును ఇకపై తెలంగాణలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఈహత్య కేసుకు సంబంధించిన అన్ని వివరాలను,డాక్యుమెంట్లను, నిందితల వాంగ్ములాలతో సహా అన్ని హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయ్యాయి.జగన్ అక్రమాస్తుల కేసు తరహాలోనే సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ కేసు కూడా విచారణ జరగబోతోంది.