Tirumala : సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ప్రకటించారు. గురువారం సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డితో కలసి టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అనంతరం వైవీ.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రెండున్నరేళ్ల  తర్వాత స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగు మాడ వీధుల్లో నిర్వహిస్తున్నామని, పెరటాశి మాసం రావడంతో  భక్తులు భారీగా వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నారు. తిరుమల, అలిపిరిలో భక్తుల కోసం తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తామన్నారు. 


పలు సేవలు రద్దు 


సెప్టెంబ‌రు 26న‌ బ్రహ్మోత్సవాల అంకురార్పణ నిర్వహించి, 27వ తేదీ సాయంత్రం 5.45 నుంచి 6.15 గంట‌ల మ‌ధ్య మీనల‌గ్నంలో ధ్వజారోహ‌ణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారన్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తొలిరోజైన‌ సెప్టెంబర్ 27న సాయంత్రం సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పిస్తారని అన్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబరు 1న గరుడ సేవ, 2న స్వర్ణర‌థం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం నిర్వహించనున్నట్లు చెప్పారు. తొలిరోజు ధ్వజారోహ‌ణం కార‌ణంగా రాత్రి 9 గంట‌ల‌కు పెద్దశేష వాహ‌నసేవ, మిగ‌తా రోజుల్లో ఉద‌యం 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సుమారు రెండేళ్ల తర్వాత మాడ వీధుల్లో శ్రీ‌వారి బ్రహ్మోత్సవ వాహ‌న‌సేవ‌లు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని, సామాన్య భ‌క్తుల‌కు పెద్దపీట వేస్తూ స‌ర్వద‌ర్శనం మాత్రమే అమ‌లు చేస్తామని టీటీడీ ఛైర్మన్ స్పష్టం చేశారు.  ఆర్జిత సేవ‌లు, శ్రీ‌వాణి, వీఐపీ బ్రేక్ ద‌ర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల త‌ల్లిదండ్రుల‌కు ప్రత్యేక ద‌ర్శనం త‌దిత‌ర ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వివరించారు. 



అలిపిరి వద్దే పార్కింగ్ 


పెర‌టాసి మాసం, రెండో శ‌నివారం గ‌రుడ‌సేవ రావ‌డంతో ర‌ద్దీకి అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు చేసి, భక్తులకు అన్న ప్రసాదం అందించడానికి అవసరమైన  ఏర్పాట్లు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భక్తుల రద్దీకి తగ్గట్టు ప్రతిరోజూ 9 ల‌క్షల లడ్డూల బ‌ఫ‌ర్ స్టాక్ ఉంచునున్నామన్నారు. ఇక సెక్యూరిటీ, పోలీసుల స‌మ‌న్వయంతో బందోబ‌స్తు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ మొత్తం రింగ్ రోడ్డులో చేసి, భక్తులను ఉచిత బస్సుల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.  బ్రహ్మోత్సవాల సమయంలో 24/7 కంట్రోల్ రూమ్‌, సీసీ కెమెరాలతో నిఘా ఉంచుతామన్నారు. గ్యాల‌రీలు, క్యూలైన్ల ఇంజినీరింగ్ ప‌నులు స‌కాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలిపిరి వ‌ద్ద ద్విచ‌క్ర వాహ‌నాలు, ఇతర వాహ‌నాల‌కు ప్రత్యేకంగా పార్కింగ్ సౌక‌ర్యం కల్పిస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో దాదాపు 3,500 మంది శ్రీ‌వారి సేవ‌కులు అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికుల‌ను అద‌నంగా ఏర్పాటు చేసామని, తిరుమలతో  పాటు అలిపిరి, తిరుపతిలో  భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే  ప్రాంతాల్లో స్పెష‌లిస్టు డాక్టర్లు, ప్రథ‌మ చికిత్స కేంద్రాలు, 10 ప్రత్యేక అంబులెన్సుల ఏర్పాటు చేసే విధంగా అధికారులకు సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. తిరుమ‌ల-తిరుప‌తి ఘాట్ రోడ్లలో గ‌రుడ‌సేవ రోజున పూర్తిగా, మ‌రుస‌టి రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ద్విచ‌క్ర వాహ‌నాల రాక‌పోక‌ల నిషేధం ఉంటుందన్నారు. కొండ మీద వాహనాల రద్దీని బట్టి అవసరమైతే అలిపిరిలో  వాహనాల నియంత్రణ చేస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.