సామాన్య భ‌క్తుల సౌక‌ర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జ‌న‌వ‌రి 1వ తేదీ, వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13 నుంచి 22వ తేదీ వ‌ర‌కు స్వయంగా వ‌చ్చే ప్రముఖుల‌కు మాత్రమే వీఐపీ బ్రేక్ ద‌ర్శనం క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని, వీఐపీ సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌మని టీటీడీ ప్రకటించింది. దర్శనానికి వచ్చే భ‌క్తులు కోవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ త‌ప్పనిస‌రిగా తీసుకురావాల‌ని తెలిపింది. శ్రీ‌వారి ఆలయంలో జ‌న‌వ‌రి 13న వైకుంఠ ఏకాదశి, జ‌న‌వ‌రి 14న‌ వైకుంఠ ద్వాద‌శి ప‌ర్వదినాల సంద‌ర్భంగా వచ్చే భ‌క్తులకు కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ద‌ర్శనం క‌ల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొంది. జ‌న‌వ‌రి 13 నుంచి 22వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శనం క‌ల్పించ‌నున్నట్లు వెల్లడించింది. 


Also Read: టెస్ట్‌ ఎర్లీ, ట్రేస్‌ ఎర్లీ, ట్రీట్‌ ఎర్లీ ... ఒమిక్రాన్‌పై అధికారులకు సీఎం జగన్ రూట్ మ్యాప్ !


గ‌దుల అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ ర‌ద్దు


జ‌న‌వ‌రి 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు వ‌స‌తి గ‌దుల అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్‌ ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది. శ్రీ‌వారి ద‌ర్శనానికి విచ్చేసే సామాన్య భ‌క్తుల‌ వ‌స‌తికి పెద్దపీట వేస్తూ తిరుమ‌ల‌లోని అన్ని గ‌దుల‌ను క‌రెంటు బుకింగ్ ద్వారా కేటాయించాల‌ని టీటీడీ నిర్ణయించింది. జ‌న‌వ‌రి 11 నుంచి 14వ తేదీ వరకు దాతల‌కు గదుల‌ కేటాయింపు ప్రివిలేజ్ ఉండదని తెలిపింది. తల‌నీలాలు తీసేందుకు తగినంత మంది క్షురకుల‌ను అందుబాటులో ఉంచామని వెల్లడించింది. కోవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ క్షురకులు పీపీఈ కిట్లు, ఆప్రాన్లు వినియోగిస్తారన్నారు. అన్నప్రసాద భవనంలో కోవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ఉదయం 4 నుంచి రాత్రి 12 గంటల‌ వరకు వితరణ ఉంటుందని పేర్కొంది. భక్తుల‌కు వైద్య సేవ‌లు అందించేందుకు అవసరమైన ప్రాంతాల్లో వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయని వివరించింది. తిరుమల‌లో పోలీసుల‌తో సమన్వయం చేసుకుని ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా వాహనాలు పార్కింగ్‌ ప్రాంతాల‌కు చేరేలా ఏర్పాట్లు చేశామని తెలిపింది.  


Also Read: టికెట్ రేట్స్ ఇష్యూ పరిష్కారానికి తొలి అడుగు... ఏపీ సీయం అపాయింట్మెంట్ కోసం టాలీవుడ్ వెయిటింగ్


కోవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ త‌ప్పనిస‌రి


'కోవిడ్-19 మూడో వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేప‌థ్యంలో ఇటీవ‌ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిక‌లు జారీ చేశాయి. అదేవిధంగా, కొన్ని ప‌ట్టణాల్లో రాత్రి క‌ర్ఫ్యూ కూడా విధించారు. ఈ నేప‌థ్యంలో భ‌క్తులు పర్వదినాల్లోనే కాకుండా మిగతా అన్ని రోజుల్లోనూ వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ త‌ప్పనిస‌రిగా తీసుకురావాలి. టీటీడీ ఉద్యోగులు, వేలాది మంది సహభక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులు టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బందికి స‌హ‌క‌రించాలి' అని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. 


Also Read: సినిమా టికెట్ల విక్రయాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... ఐఆర్సీటీసీ తరహాలో ఏపీఎఫ్‌డీసీకు బాధ్యతలు అప్పగింత....





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి