Tirumala : సంపూర్ణ చంద్రగ్రహణం వీడడంతో తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు తెరచుకుంది. మంగళవారం ఉదయం సరిగ్గా 8:41 గంటలకు ఆలయ మహాద్వారాలను చంద్రగ్రహణానికి పదకొండు గంటల ముందే మూసివేశారు అర్చకులు. దీంతో స్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తులను తాత్కాలికంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అనుమతి రద్దు చేసింది టీటీడీ.  అంతే‌ కాకుండా తిరుమలలో లడ్డూ వితరణ, అన్నప్రసాదం వితరణను సైతం టీటీడీ నిలిపివేసింది. చంద్ర గ్రహణం వీడిన అనంతరం శాస్త్రబద్దంగా ఆలయ అర్చకులు రాత్రి 7:27 గంటలకు టీటీడీ అధికారుల సమక్షంలో ఆలయ ద్వారాలను తెరిచారు. అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపడుతూ ఒక్కొక్క ద్వారం  తెరిచారు. ఆలయ అర్చకులు పుణ్యవచనం నిర్వహించడంతో గ్రహదోషం తొలగిపోయింది. అనంతరం మూలవిరాట్టు‌పై కప్పిన వస్త్రం తొలగించి స్వామి వారికి రాత్రి కైంకర్యాలైన తోమాల, అర్చన సేవలను అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. తరువాత స్వామి వారికి నైవేద్యం సమర్పించిన తర్వాత  రాత్రి 8:00 గంటల నుంచి సామాన్య భక్తులను శ్రీవారిని దర్శనానికి టీటీడీ అనుమతించింది. 


శ్రీశైలంలో 


నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆళయంలో చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఆలయాన్ని మూసివేశారు.  వేకువ జామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ముందుగా మంగళ వాయిద్యాలు, 3.30గంటలకు నుండి సుప్రభాతసేవ, 4.30గంటలకు శ్రీస్వామి అమ్మవార్ల మహా మంగళ హారతులు నిర్వహించారు. మహా మంగళ హారతి సమయం నుండే భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. తిరిగి సాయంత్రం 6.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరచిన తరువాత ఆలయ శుద్ధి, మంగళ వాయిద్యాలు, సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలు చేశారు. రాత్రి 8 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. గ్రహణం కారణంగా అన్ని ఆర్జితసేవలు, శాశ్వతసేవలు, పరోక్షసేవలు నిలిపివేశారు. గ్రహణం కారణంగా ఈ రోజు మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా నిలుపుదల చేస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి అల్పాహారం అందిస్తున్నారు. .


తెరచుకున్న ఆలయాలు 


దేశవ్యాప్తంగా చంద్ర గ్రహణం వీడింది. ఖగోళ శాస్త్రంలో అద్భుతంగా చెప్పుకునే చంద్ర గ్రహణం పూర్తైంది. పలు రాష్ట్రాల్లో బ్లడ్ మూన్ కనువిందు చేసింది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో గంట పాటు గ్రహణం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో  39 నిమిషాల పాటు గ్రహణం కొనసాగింది. దేశంలో మధ్యాహ్నం 2.19 నిమిషాలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు కనువిందుచేసింది. తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 5.40 గంటల నుంచి చంద్రగ్రహణం కనువిందు చేసింది. గౌహతిలో అత్యధికంగా 1.43 నిమిషాల పాటు చంద్ర గ్రహణం కనిపించింది.  తెలుగు రాష్ట్రాల్లో 39 నిమిషాల పాటు గ్రహణం కనిపించింది.  అయితే దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో చంద్ర గ్రహణం కనిపించింది. 



మళ్లీ మూడేళ్ల తర్వాత 


తెలుగు రాష్ట్రాల్లో చంద్ర గ్రహణంతో పలు ఆలయాలను మూసివేశారు. గ్రహణం వీడటంతో ఆలయాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఈ ఏడాది ఇదే చిట్టచివరి చంద్రగ్రహణం కావడం విశేషం. సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజుల్లోనే చంద్ర గ్రహణం ఏర్పడడం ఖగోళ వింతల్లో ఒకటి అని శాస్త్రవేత్తలు అంటున్నారు. మళ్లీ చంద్రగ్రణహం కనిపించేది మూడేళ్ల తర్వాతే అని అంటున్నారు.  2025 సెప్టెంబర్ 7న మళ్లీ చంద్ర గ్రహణం ఏర్పడనుంది.  అయితే పాక్షిక చంద్ర గ్రహణం మాత్రం 2023 అక్టోబర్‌ లో కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. 


Also Read : Hindupur News : ప్రభుత్వ ఉపాధ్యాయుడికి వింత కష్టం, గుండు చేయించుకుంటే గుర్తుపట్టడంలేదు!