YS Sharmila : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక వర్గం భీమారం మండల కేంద్రంలో వైఎస్ఆర్టీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా నిర్వహించిన ఈ సభలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కాదు..బానిస సుమన్ అంటూ మండిపడ్డారు. దొర పక్కన కూర్చొనే సరికి దొర పోకడలు వచ్చాయన్నారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు ఎమ్మెల్యే కాస్త రౌడీ సుమన్ అయ్యారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఏమయ్యిందని షర్మిల ప్రశ్నించారు. 100 రూపాయలు లేవని చెప్పిన సుమన్ కు ఇవాళ 100ల కోట్లు ఎలా వచ్చాయని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.  సీఎం కేసీఅర్ జన్మలో ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు.  ఈ చెన్నూరు నియోజక వర్గానికి కేసీఆర్ చేసింది మోసమే అని ఆరోపించారు. ప్రాణహిత - చేవెళ్ల ద్వారా ఈ చెన్నూరుకి లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని అనుకున్నారని,  ప్రాజెక్ట్ డిజైన్ మార్చి ఈ నియోజక వర్గానికి అన్యాయం చేశారని ఆక్షేపించారు. 


అండర్ గ్రౌండ్ మైనింగ్ ఏమైంది? 


 "గొల్లవాగు ప్రాజెక్ట్ ద్వారా 50 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని అనుకున్నారు. ప్రాజెక్ట్ కట్టిస్తే వైఎస్సార్ కి పేరు వస్తుందని టీఆర్ఎస్ ప్రభుత్వం కాలువలు కూడా తవ్వించడం లేదు. కోల్ బెల్ట్ ఏరియాలో 30 వేల మందికి పట్టాలు ఇవ్వాలని అనుకున్నారు. కేసీఆర్ పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వలేకపోయారు. అండర్ గ్రౌండ్ మైనింగ్ మాత్రమే ఉంటాయని కేసీఆర్ చెప్పి మోసం చేశారు. ఓపెన్ కాస్ట్ ఉండదు అని...కుర్చీ వేసుకొని బంద్ చేస్తా అని అన్నారు. కుర్చీ దొరకలేదు... పైగా ఓపెన్ కాస్ట్ లు 19కి పెంచారు. అండర్ గ్రౌండ్ మైనింగ్ పూర్తిగా బంద్ చేశారు. సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవు అన్నారు. ఒక్కరినీ రెగ్యులర్ చేయలేదు. బాస్ డిపో, రెవెన్యూ డివిజన్, మందమర్రి ఎన్నికలు అని మోసం చేశారు."- వైఎస్ షర్మిల   


వందల కోట్లు ఎలా వచ్చాయ్? 


బాల్క సుమన్ ఎమ్మెల్యే గా ముదిరి గూండా అయ్యారని వైఎస్ షర్మిల ఆరోపించారు. స్వపక్షం, ప్రతిపక్షం అని తేడా లేకుండా అందరికీ వార్నింగ్ లు ఇస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇంటికి పిలిచి తన్నిస్తాదట కదా, జర్నలిస్ట్ లు అని చూడకుండా కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.  100 రూపాయలు కూడా తన జేబులో లేవు అని చెప్పిన బాల్క సుమన్ కు 100ల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు, ఇసుక మాఫియా, సింగరేణి భూములు అన్ని కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో బాల్క సుమన్ ను తన కొడుకు అని కేసీఆర్ అన్నారని, కొడుకు అయితే సిరిసిల్ల ఎలా ఉంది ఈ చెన్నూరు ఎలా ఉందని ప్రశ్నించారు. కొడుకు అన్నందుకు కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఈగ కూడా వాలనివ్వడట అన్నారు. 


బానిస సుమన్


'మహారాష్ట్ర లో బాల్ తాక్ రే ను ఏమైనా అంటే ఎవరైనా వదిలి పెడతారా అంటాడట? ఈయన బాల్క సుమన్ నా...బానిస సుమనా? ఉద్యమ సమయంలో ఎంత మంది నిరుద్యోగులను రెచ్చ గొట్టాడు? ఆత్మహత్యలకు కారకుడు అయ్యాడు. మీ మాజీ ఎమ్మెల్యే నే ఈ విషయం చెప్పారు. విద్యార్థి నాయకుడు అయి ఉండి ఒక్క సారైనా ఆత్మహత్యల మీద మాట్లాడారా? ఈ నియోజకవర్గంలో మహేష్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ కూడా రాశాడు. నా చావే ఆఖరి చావు అని కూడా అన్నాడు. మీ కాళ్లు మొక్కుతా అంటూ లెటర్ లో రాసి పెట్టీ మరి చనిపోయాడు. కనీసం ఈ ఎమ్మెల్యే ఆ నిరుద్యోగి ఇంటికి వెళ్లి పరామర్శించారా?. కనీసం ఒక రూపాయి సహాయం చేశారా? అదుకోవడం చేతకాదు కానీ.. మహేష్ కుటుంబంతో నా కొడుకు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీస్ స్టేషన్ లో చెప్పించడాట.'- వైఎస్ షర్మిల 


కర్రు కాల్చి వాత పెట్టండి 


వచ్చే ఎన్నికల్లో బాల్క సుమన్ కు కర్రు కాల్చి వాత పెట్టాలని వైఎస్ షర్మిల అన్నారు.  తెలంగాణలో సమస్యలు లేవని కేసీఆర్ చెప్తున్నారని,  సమస్యలు ఉన్నాయని 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశానన్నారు. తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టానన్నారు. వైఎస్సార్ పెట్టిన ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తానన్నారు.