TDP News : టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆదాయాన్ని అక్రమ మార్గాల్లో కుమారుడి ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగిస్తున్నారని టీడీపీ ఆరోపించింది. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. దేవస్థానం డబ్బుల్ని తన కుమారుడు అభినయ్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన స్థలాల చుట్టూ అభినయ్‌రెడ్డి 5.45 ఎకరాలు ఎలా కొనుగోలు చేశారో చెప్పాలని ఆనం డిమాండ్ చేశారు.
శ్రీవారి సొమ్ముతో తిరుపతిలో రోడ్లు
తిరుపతి కార్పొరేషన్ వేయాల్సిన రోడ్లను వెంకటేశ్వరస్వామి సొమ్ముతో వేస్తున్నారని.. ఇలా చేసే అధికారం భూమనకు ఎవరిచ్చారని ఆనం ప్రశ్నించారు. అభినయ్ రెడ్డి రాజకీయ జీవితం కోసం శ్రీవారి నిధులు రూ.150 కోట్లతో తిరుపతిలో ఇంటర్నల్ రోడ్లు వేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ గా ఉన్న కరుణాకర్ రెడ్డి ఇప్పటివరకు స్వామివారికి సంబంధించిన ఎంత సొమ్మని ఇలా దారిమళ్లించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. స్వామివారి సొమ్మును తమ సొంత పనులకు వినియోగించడమే తప్పయితే..ఆ పనుల్లో మరల కరుణాకర రెడ్డి 10శాతం కమీషన్లు తీసుకుంటున్నాడని ఆనం ఆరోపించారు.
పది శాతం కమిషన్ల రెడ్డిగా కరుణాకర్ రెడ్డికి పేరు
తిరుపతిలో అందరూ భూవన కరుణాకర్ రెడ్డిని 10శాతం కమీషన్ల కరుణాకర్ రెడ్డి అంటున్నారని ఎద్దవా చేశారు. స్కామ్‌లు చేసి.. కేసుల్లో ఇరుక్కొని.. కోటీశ్వరులైపోయి.. జగన్ రెడ్డి మిత్రులైతే టీటీడీ సభ్యులు అయిపోతారా? అని నిలదీశారు. జగన్ రెడ్డి ఏలుబడిలో టీటీడీ సభ్యులు కావాలంటే ఒకటి కోటీశ్వరులు అయినా అయ్యిండాలి..లేదా స్కామ్ లైనా చేసి ఉండాలి..గజదొంగలైనా అవ్వాలి..లేదా జగన్ రెడ్డితో వ్యాపార లావాదేవీ లైనా ఉండాలి. ఈ విధానం ఎంతమాత్రం సరైంది కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా జరుగుతున్న అవినీతిపై టీడీపీప్రభుత్వం రాగానే విచారణ జరిపించి.. తప్పుచేసిన వారిని కచ్చితంగా న్యాయస్థానాల్లో నిలబెడుతుందని హెచ్చరించారు.
ధర్మారెడ్డిపై ఢిల్లీలో కేసులు
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఐఏఎస్ అధికారులు పనిచేయాల్సిన స్థానంలో డిఫెన్స్‌లో పనిచేసే ధర్మారెడ్డిని నియమించడం చట్ట, ధర్మ విరుద్ధం అని ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై సాటి సివిల్ సర్వీస్ అధికారులు స్పందించరా? అని నిలదీశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అటెండర్‌గా... జగన్ సేవలో తరించే ఆయన తిరుపతి గుమాస్తాగా ధర్మారెడ్డి పనిచేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి ఎంతో... తిరుమల లో ధర్మారెడ్డి అంత అని అభివర్ణించారు. ఢిల్లీకి చెందిన దీన్ దయాళ్ తల్వార్ 14 సెక్షన్ల కింద ధర్మారెడ్డిపై పెట్టిన కేసుల గురించి.. న్యాయస్థానం ధర్మారెడ్డికి నోటీసులు ఇచ్చిన విషయం జగన్ రెడ్డికి తెలుసా..లేదా? అని ప్రశ్నించారు. అన్నీ తెలిసి అనర్హుడిని ఎలా టీటీడీలో కొనసాగనిస్తారు? అని ప్రశ్నించారు. ఉదయం లేస్తే ధర్మారెడ్డి చేసే పని ఒక్కటే.. ప్రత్యేకవిమానంలో పూజారుల్ని ఎక్కించుకొని ఢిల్లీకి వెళ్లడం..అక్కడ ఆ శీర్వచనాల పేరుతో పెద్దపెద్దవాళ్లను కలిసి వారి ద్వారా తనకు కావాల్సిన పనులు .. ఇతర వ్యవహారాలు చక్కబెట్టుకోవడం అని విమర్శించారు.