Tirumala Tickets : శ్రీవారి దర్శన భాగ్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులకు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వేంకటేశ్వరుడి దర్శనం సులభతరం చేస్తూ ప్రతి నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు, ఆర్జిత సేవ టోకెన్లు, అంగప్రదక్షణ టోకెన్లు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ టోకెన్లను tirupatibalaji.ap.gov.in లో విడుదల చేస్తుంది టీటీడీ. డిసెంబరు నెలకు సంబంధిన ఆర్జిత సేవలు, వర్చువల్ దర్శన టికెట్లను ఈ నవంబర్ 16వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది.
ఆర్జిత సేవ టికెట్లు
డిసెంబరు నెలకు సంబంధించిన ఆర్జిత సేవ టిక్కెట్ల ఆన్‌లైన్ కోటాను ఈ నెల 16న ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది. ఈ కోటాలో డిసెంబర్ నెలకు సంబంధించిన వర్చువల్ సేవకు సంబంధించిన దర్శన టోకెన్లు, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించిన వర్చువల్ సేవ సంబంధిత దర్శన టికెట్లు ఉన్నాయి. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతుంది. ఇక సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శన భాగ్యం కల్పించేందుకు టైం స్లాట్ విధానంలో ప్రతి రోజు తిరుపతిలో మూడు ప్రాంతాల్లో దాదాపు ముప్ఫై కేంద్రాల్లో టైం స్లాట్ టోకెన్లు జారీ చేస్తుంది టీటీడీ. అయితే శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు జారీ చేయగా, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో 15 వేల టోకెన్లు జారీ చేస్తూ వస్తుంది. భక్తుల రద్దీ అనుగుణంగా టోకెన్ల జారీ ప్రక్రియను పెంచుతూ వస్తుంది. టైం స్లాట్ విధానం ద్వారా టిక్కెట్లు పొందిన భక్తులు కేటాయించిన సమయానికి తిరుమలకు చేరుకుని గంటల తరబడి వేచి ఉండే పని లేకుండా గంట సమయంలోనే దర్శన భాగ్యం పొందే అవకాశం ఉంది. టోకెన్లు పొందలేని భక్తులు నేరుగా తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 కు చేరుకుని స్వామి వారి దర్శన భాగ్యం కల్పించే వెసులుబాటు కల్పించింది టీటీడీ.
విశాఖలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం
విశాఖ సాగర తీరంలో అశేష భక్తజనంతో కార్తీక దీపోత్సవం జరుపుకోవడం పూర్వ జన్మ సుకృతమని టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం విశాఖపట్నం ఆర్కే బీచ్ లో టీటీడీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హైందవ సంప్రదాయంలో కార్తీక మాసానికి విశేష ప్రాముఖ్యం ఉందని, పూజాధికాలు పాటించిన వారు దైవ కృపకు పాత్రులవుతారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు హిందూ ధర్మ ప్రచారంతో హైందవ ధర్మాన్ని ప్రపంచ నలు మూలలా పెంపొందిస్తున్నామని చెప్పారు. అనకాపల్లి, రంపచోడవరంలలో దళిత, గిరిజనవాడల్లో, మారుమూల పల్లెల్లో కూడా శ్రీవారి కళ్యాణ మహోత్సవాలు జరిపామని వివరించారు. టీటీడీ ఆస్తుల విషయంలో తమ ప్రభుత్వం పారదర్శకంగా ఉందని, రూ. 15 వేల కోట్ల నగదు, 10 వేల కేజీల బంగారాన్ని బ్యాంకుల్లో జమచేశామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించిన నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి మహాస్వామి మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి దైవాన్ని దగ్గరకు చేరుస్తున్న టీటీడీ కృషిని కొనియాడారు. ఆంధ్రాలో తిరుపతి మహాక్షేత్రం ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టమని, ఏ క్షేత్రం చేయనంతగా టీటీడీ హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, పురోహితులు పాల్గొన్నారు.