Tirumala Heavy Rush :తిరుమల భక్తజన సంద్రంగా మారింది. వరుస సెలవులు, పెరటాసి మాసం కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీనివాసుడి దర్శనం కోసం ఏడుకొండలకు చేరుకుంటున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 1, 2 కంపార్ట్మెంట్లు, నారాయణగిరిలో షెడ్లు పూర్తిగా భక్తులతో నిండి పోయాయి. దాదాపుగా ఆరు కిలో మీటర్ల మేర భక్తుల క్యూలైన్ చేరింది. గోగర్భం డ్యాం వరకూ భక్తులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్యూలైన్స్ లో వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి దాదాపు 45 గంటల నుండి 48 గంటల సమయం పడుతుంది. పెరటాసి మాసం కావడంతో స్వామి వారి దర్శనార్థం భక్తులు అనూహ్య రీతిలో తిరుమలకు చేరుకోవడంతో ఎటుచూసినా తిరుమల పుణ్యక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. స్వామి వారి దర్శనంతో పాటుగా, అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రం, గదుల కేటాయింపు కేంద్రాల వద్ద భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 


పెరటాసి మాసం కావడంతో 


వేంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన మాసంగా చెప్పబడే పెరటాసి మాసం(తిరుమల శనివారాలు) కావడంతో శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తులు ఎంతో భక్తి భావంతో స్వామి వారి సన్నిధికి చేరుకుంటున్నారు. ఇలా తిరుమలకు చేరుకున్న భక్తులతో తిరుమలగిరులు గోవిందుడి నామస్మరణలతో మారుమోగుతున్నాయి. పెరటాసి మాసంలో వేంకటేశ్వర స్వామి వారిని ప్రత్యక్షంగా దర్శించుకోవడం ద్వారా చేసిన పాపాలు తొలగి శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అయితే శ్రీనివాసుడిని ఎంతగానో భక్తి శ్రద్దలతో కొలిచే భక్తులు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. టీటీడీ అధికారులు ఏమాత్రం ఊహించని స్థాయిలో భక్తులు తరలివస్తుండడంతో అప్రమత్తమైన అధికారులు క్యూలైన్స్ లో వేచి ఉన్న సామాన్య భక్తుల కోసం నిరంతరాయంగా అన్నప్రసాదం, తాగునీరు, పాలు వంటి ఆహార పదార్థాలను అందిస్తోంది. అంతే కాకుండా క్యూలైన్స్ వద్ద టీటీడీ అధికారులతో పాటుగా పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. 


క్యూలైన్ లోకి అనుమతి రద్దు 


భక్తులకు ఎటువంటి లోటు కలుగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటుంది. గోగర్భం డ్యాం నుంచి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్యూలైన్స్ ద్వారా భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి అనుమతిస్తోంది. ఇందుకోసం తిరుమలలోని ఉచిత బస్సుల సహాయంతో భక్తులను వివిధ ప్రాంతాల నుంచి గోగర్భం వద్దకు చేర్చి అక్కడ నుంచి క్యూలైన్స్ లో భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నారు. దాదాపుగా ఎనిమిది కిలో మీటర్ల మేర భక్తులు క్యూలైన్స్ లో వేచి ఉన్నారు.  భక్తులకు క్యూలైన్స్ లో అసౌఖర్యం కలుగకుండా క్యూలైన్స్ కి పై భాగంగా ఇనుప రేకులను అమర్చారు.  నిరంతరాయంగా తిరుమలకు వస్తూనే ఉండడంతో నేటి రాత్రి ఏడు గంటలకు స్వామి వారి దర్శనానికి భక్తులను క్యూలైన్స్ లోకి అనుమతిని టీటీడీ రద్దు చేసింది. తిరుమలలో ఉన్న యాత్రికుల సముదాయంలో భక్తులు బస చేసి ఆదివారం ఉదయం పది గంటలకు క్యూలైన్స్ వద్దకు రావాలని విజ్ఞప్తి చేస్తుంది. రాత్రి సమయంలో భక్తులు గంటల తరబడి క్యూలైన్స్ లో వేచి ఉండే పరిస్థితి ఉండడంతో టీటీడీ ఈ నిర్ణయం‌ తీసుకుంది. అంతే కాకుండా తిరుమలలో భక్తుల అధిక రద్దీ కారణంగా భక్తులు తమ తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది.