Tirumala : వెంకన్న భక్తులతో  సప్తగిరులు నిండిపోయాయి. పెరటాసి మాసం కావడంతో అనూహ్యంగా భక్తుల‌ రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. తిరుమల యాత్రను భక్తులు వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. తాత్కాలికంగా క్యూలైన్స్ లోకి భక్తుల అనుమతిని రద్దు  చేసింది. భక్తులను విశ్రాంతి భవనాలకు బస్సుల ద్వారా తరలిస్తున్నారు టీటీడీ అధికారులు. రేపు ఉదయం 10 గంటలకు భక్తులను క్యూలైన్స్ లోకి అనుమతించనున్నారు.  


భక్త జనసంద్రంగా తిరుమల 


 శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కళకళ‌ లాడుతుంది. ఎటు చూసినా భక్తుల గోవింద నామ స్మరణలతో ఏడు కొండలు మారుమోగుతున్నాయి. వరుస సెలవులు, పెరటాసి మాసం కావడంతో తిరుమల పుణ్యక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. సుదూర ప్రాంతాల‌ నుంచి విచ్చేసిన భక్తులతో వైకుంఠం‌ క్యూ కాంప్లెక్స్ 1, 2 లోని కంపార్ట్మెంట్లు, నారాయణ గిరి ఉద్యానవనంలోని షెడ్లు అన్ని భక్తులతో నిండి పోయాయి. గోగర్భం డ్యాం వరకూ క్యూలైన్స్ లో భక్తులు నిరీక్షిస్తున్నారు. కొద్ది రోజులుగా తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుండంతో సామాన్య భక్తులకు పెద్ద పీట వేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. మరోవైపు సామాన్య భక్తులకు‌ కల్పించే సౌకర్యాలపై ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులతో సంప్రదిస్తూ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అంతే కాకుండా అధికారులు భక్తుల రద్దీ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ‌మెరుగైన సేవలు అందించాలని‌ ఈవో ఏవి.ధర్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 


సిఫార్సు లేఖలు రద్దు 


తిరుమల కొండ భక్తజనంతో నిండి పోయింది. దీంతో టీటీడీ యాత్ర సదన్, కల్యాణ కట్ట, అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రం, అఖిలాండం ప్రాంతాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. వేలాది సంఖ్యలో‌ భక్తులు వివిధ మార్గాల ద్వారా ఒక్కసారిగా కొండకు చేరుకోవడంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. భక్తుల ఇబ్బందులను టీటీడీ దృష్టిలో ఉంచుకొని భక్తులు అధికంగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో పుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసింది. తాగునీరు, అల్పాహారంతో పాటు పాలు అందిస్తుంది‌ టీటీడీ. సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తూ శుక్రవారం, శనివారం, ఆదివారం రోజుల్లో‌ సిఫార్సు లేఖలను రద్దు చేస్తూ నిర్ణయం‌ తీసుకుంది. కేవలం ప్రోటోకాల్ భక్తులకే పరిమితం చేసింది. ఇక ఆన్లైన్ ద్వారా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందిన భక్తులకు నాలుగు గంటల సమయంలోనే స్వామి వారి దర్శనం లభించగా, సామాన్య భక్తులకు 48 గంటల సమయం  పడుతుంది. స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు‌ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో పాలు, అల్పాహారం అందిస్తుంది. శుక్ర, శని, ఆదివారాలు కావడంతో‌ స్వామి వారి దర్శనం కోసం భక్తులు అధికంగా వస్తున్నాయని అధికారులు అంచనా వేశారు. 


 తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలి  


తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, గోగర్భం వద్ద గల క్యూలైన్స్ ను టీటీడీ అధికారులతో కలిసి ఈవో ఏవి.ధర్మారెడ్డి పరిశీలించారు.  ఈవో ఏవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నిన్నటి నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారని, పవిత్రమైన పెరటాసి మూడో శనివారం రావడం, వరుస సెలవుల కారణంగా భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారన్నారు. ఇప్పటికే క్యూలైన్ ఎండ్ పాయింట్ వరకు భక్తులు వేచియున్నారని, ఇకపై క్యూలైన్ లోకి వస్తున్న భక్తులను రేపు ఉదయం రావాలని ఆయన సూచించారు. ఫ్రీ బస్సుల ద్వారా భక్తులను విశ్రాంతి నిలయాలకు పంపుతున్నామన్నారు.  తిరుమలకు వచ్చే భక్తులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరుతున్నామన్నారు. రేపు ఉదయం 10 గంటలకు క్యూలైన్ లో భక్తులను అనుమతిస్తామని టీటీడీ ఈవో వెల్లడించారు.