Tirumala Jagan Stickers : తిరుమల బాలాజీ నగర్ లో ఇళ్లకు వైసీపీ నేతలు సీఎం జగన్ స్టిక్కర్లు అతికించడంపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతి టీటీడీ పరిపాలన భవనం ముందు జనసేన నేతలు నిరసన చేపట్టారు. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ స్టిక్కర్లు అతికించడంపై  జనసేన తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, అధికార ప్రతినిధి కీర్తన టీటీడీ వీజీవోను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ ఘటనతో టీటీడీ నిఘా వైఫల్యం మరోసారి బట్టబయలైందని జనసేన నేతలు ఆరోపించారు. టీటీడీ విజిలెన్స్ కు తెలియకుండా వందలాది వైసీపీ స్టిక్కర్లను ఎలా తిరుమలకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తిరుమలను వైసీపీ కార్యాలయంగా మారుస్తున్నారని ఆరోపించారు. స్టిక్కర్లను అంటించిన వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా ఉన్నతాధికారులు స్పందించకుంటే టీటీడీ పరిపాలనా భవనాన్ని ముట్టడిస్తామని జనసేన నేతలు స్పష్టం చేశారు. 

వైసీపీ కార్యాలయంగా మార్చేందుకు 

"వైసీపీ అధికారంలోకి రాగానే తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేసింది. ఇప్పుడు తిరుమల కొండను వైసీపీ కార్యాలయంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరుమలలో ఎలాంటి రాజకీయ, ఇతర సిక్కర్లు అంటించకూడదు. వీటిపై నిషేధం ఉంది. తిరుమలకు వెళ్లే ముందు టోల్ ప్లాజా దగ్గర వాహనాలకు ఏదైనా స్టిక్కర్ ఉంటే తీసేసి సిబ్బంది.. కొండపైకి ఇన్ని వందల స్టిక్కర్లు, బ్యాగులు ఎలా అనుమతి ఇచ్చారు. ఎవరు అండదండలతో స్టిక్కర్లు పైకి పంపించారు. తిరుపతి ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయా? ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంపై విజిలెన్స్ అధికారికి ఫిర్యాదు చేశాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. వారం రోజుల్లో బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే అలిపిరిలో టీటీడీ భవనాన్ని ముట్టడిస్తాం"- రాజారెడ్డి, జనసేన నేత 

తిరుమల కొండపై రాజకీయ ప్రచారం 

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల బాలాజీనగర్‌లో సోమవారం కొంతమంది వైసీపీ నేతలు, కార్యకర్తలు 'మా నమ్మకం నువ్వే జగన్‌' స్టిక్కర్లు అతికింటారు. వైసీపీ బ్యాగులు, పాంప్లెట్లతో నిబంధనలకు విరుద్ధంగా హడావుడి చేశారు. వ్యక్తుల విగ్రహాలు, ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, అన్యమత ప్రచారానికి సంబంధించిన ప్రచార సామాగ్రిని తిరుమలలో నిషేధించింది టీటీడీ. అయితే వైసీపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యక్రమం చేపట్టారు. పార్టీ ప్రచారాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై విజిలెన్స్‌ వీజీవో బాలిరెడ్డి స్పందిస్తూ.. ఏ పార్టీ వారికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. స్టిక్కర్ల ప్రచారంపై సమాచారం రాగానే ఏవీఎస్వో, సిబ్బంది బాలాజీనగర్‌కు చేరుకుని ఇళ్లను పరిశీలించారన్నారు. అయితే వైసీపీ శ్రేణులు అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయారన్నారు. ఇళ్లకు అంటించిన స్టిక్కర్లను కూడా వాళ్లే తొలగించారన్నారు. అలిపిరి చెక్‌పాయింట్‌లో సిబ్బంది ఈ స్టిక్కర్లను ఎలా అనుమతించారో తనకు తెలియదన్నారు. బాలాజీనగర్ లో ఇళ్లకు సీఎం జగన్‌ స్టిక్కర్లు అతికించే కార్యక్రమంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  పవిత్రమైన తిరుమల క్షేత్రంలో కూడా రాజకీయాలు చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.