Archana Gautam : తిరుమలలో బ్రేక్ దర్శనం విషయంలో యూపీకి చెందిన సినీ నటి, కాంగ్రెస్ నేత అర్చన గౌతం మధ్య వివాదం తలెత్తింది. తనకు దర్శన టికెట్ ఇవ్వలేదని ఆరోపిస్తూ ఆమె ఓ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. బుధవారం కేంద్ర మంత్రి సిఫార్సు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శనానికి ఆమె అప్లై చేశారు. జేఈవో కార్యాలయంలోని సూపరింటెండెంట్ వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయించకుండా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కేటాయించినట్లు తెలుస్తోంది. అందుకు అర్చన గౌతం అంగీకరించకుండా టీటీడీ సిబ్బందిని నిలదీశారు. దీంతో టీటీడీ సిబ్బందికి యూపీ భక్తురాలికి మధ్య గొడవ తలెత్తింది. టీటీడీ సిబ్బందిపై ఆగ్రహంతో దాడికి యత్నించింది.
"భారతదేశంలోని హిందూ ధార్మిక స్థలాలు దోపిడీ పెరిగిపోయింది. మతం పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన టీటీడీ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలి. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. వీఐపీ దర్శనం పేరుతో ఒకరి నుంచి రూ.10,500 తీసుకుంటున్నారు. ఇలవా దోచుకోవడం ఆపండి" అని అర్చన గౌతం ట్వీట్ పెట్టారు.
అసలేం జరిగింది?
తిరుమల శ్రీవారి దర్శనానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇలా దర్శనానికి విచ్చేసే భక్తులలో కొంతమంది సరైనా అవగాహన లేకపోవడంతో టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతారు. భక్తులకు సమాచారం అందించేందుకు తిరుమలలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసింది టీటీడీ. కాలక్రమేణ వాటి సంఖ్య తగ్గు ముఖం పట్టింది. మొదటిసారి వచ్చిన భక్తులు సమాచారం కోసం తికమడపడుతుంటారు. ఇలాంటి పరిస్థితే నటి, కాంగ్రెస్ నేత అర్చన గౌతంకు ఎదురైంది. గత బుధవారం యూపీకి చెందిన నటి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అర్చన గౌతం ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ కేటాయించింది టీటీడీ. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఆమె తిరుమలకు చేరుకోలేకపోయారు.
ముందు రోజు దర్శనం టికెట్ తో
అయితే దర్శనం చేసుకునేందుకు ప్రయత్నించిన అర్చన గౌతం, చివరి అవకాశంగా తిరుమల జేఈవో కార్యాలయానికి వెళ్లారు. టీటీడీ సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించక పోవడంతో, తాను యూపీకి చెందిన ఓ ఎమ్మెల్యే మనిషిని అంటూ చెప్పి కార్యాలయంలోనికి ప్రవేశించింది. అక్కడ ఉన్న సిబ్బంది ఎందుకు వచ్చారని ప్రశ్నించగా, తనకి బుధవారం దర్శనం టికెట్ జారీఅయిందని, కొన్ని కారణాలతో స్వామి వారి దర్శనం చేసుకోలేకపోయామని తెలిపారు. టీటీడీ నిబంధనల ప్రకారం ముందు రోజు జారీ చేసిన టికెటును మరుసటి రోజు పంపేందుకు వీలులేదని, మిమ్మల్ని దర్శనానికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
మహిళపై చేయి చేసుకున్న అధికారి!
శ్రీవారి దర్శనం పొందాలనుకుంటే ఉచిత దర్శనం, లేదా శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శనానికి వెళ్లే అవకాశం ఉందని సూచనలు చేశారు. దీంతో ఆగ్రహించిన అర్చన గౌతం టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో వీడియో తీసేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న సిబ్బంది ఆమెను నిలువరించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఓ సూపరింటెండెంట్ స్థాయి అధికారి మహిళపై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పటికీ కొందరు సిబ్బంది వారిని బుజ్జగించి పంపారని తెలుస్తోంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై టీటీడీ అధికారులు స్పందించాల్సి ఉంది.