America Srinivasa Kalyanam : అమెరికాలో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం జూన్ 18 నుంచి జులై 9వ తేదీ వరకు ఎనిమిది నగరాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.  తిరుమలలో శనివారం ఆయన ఈవో ధర్మారెడ్డితో కలసి మీడియాతో మాట్లాడుతూ గత రెండున్నరేళ్లుగా కరోనా వల్ల ఇతర దేశాల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అమెరికాలోని భక్తుల కోసం టీటీడీ శ్రీవారి కల్యాణాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాస భారతీయుల అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామన్నారు.  జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్, 25న డల్లాస్, 26న సెయింట్ లూయిస్, 30న చికాగో నగరాల్లో స్వామివారి కల్యాణాలు నిర్వహిస్తామని ఛైర్మన్ చెప్పారు. అలాగే జులై 2న న్యూ ఆర్లిన్, 3న వాషింగ్టన్ డీసీ, 9వ తేదీ అట్లాంటా నగరాల్లో శ్రీవారి కల్యాణాలు జరుగుతాయన్నారు. 


ఇతర దేశాల నుంచి విజ్ఞప్తులు 


ఇతర దేశాల నుంచి కూడా తమ ప్రాంతాల్లో శ్రీవారి కల్యాణాలు నిర్వహించాలని విజ్ఞప్తులు వచ్చాయని వాటిని కూడా పరిశీలిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సిద్ధంగా ఉన్నాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఆంధప్రదేశ్ ప్రవాసభారతీయుల అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శ్రీనివాసుడి కల్యాణోత్సవంలో భక్తులు ఉచితంగా పాల్గొనవచ్చనన్నారు. 


తిరుమలలో భక్తుల రద్దీ 


తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. దాంతో తిరుమలలో భక్తులతో కంపార్ట్‌మెంట్స్ నిండిపోయాయి. బయట సైతం క్యూ లైన్స్ ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి దర్శనానికి దాదాపు 25గంటలు పట్టే అవకాశం ఉంది స్వయంగా టీటీడీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందో శ్రీవారి భక్తులు అర్థం చేసుకోవచ్చు. కరోనా వ్యాప్తి తరువాత.. దాదాపు రెండేళ్ల అనంతరం ఇటీవల తరచుగా తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. కొన్ని సందర్భాలలో శ్రీవారి దర్శనానికి ఒకరోజు నుంచి రెండు రోజుల సమయం పడుతోంది. టీటీడీ ఎన్ని ఏర్పాట్లు చేసినా, భక్తుల అనూహ్య రద్దీతో స్వామి వారి దర్శనానికి గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.


శ్రీవారి హుండీ ఆదాయం 


తిరుమలలో శనివారం నాడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనార్థం భక్తులు రాంభగీచా అతిథి గృహాలు వరకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ప్రస్తుతం తిరుమలకు వచ్చే భక్తులకు స్వామివారి దర్శనానికి కనీసం ఒకరోజు సమయం పడుతోంది. కాగా, నిన్న శ్రీవారిని  67,949 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,837 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకలు, విరాళాల రూపంలో నిన్ని ఒక్కరోజు శ్రీవారి హుండీకి రూ.3.70 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు