Tiger Wandering: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య పులుల సంచారం ఎక్కువవుతోంది. ఎక్కడ చూసినా పులి కనిపిస్తూ... జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఫారెస్ట్ అధికారులు స్పెషల్ ఆపరేషన్ మొదలు పెట్టినా చిక్కడం లేదు. పులుల సంచారం వల్ల రైతులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పులులు ఎప్పుడు ఎలా దాడి చేస్తాయో తెలియక బిక్కుబిక్కుమంటూ  నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో గత కొన్నినెలలుగా సంచరిస్తున్న పులి కోసం వేట కొనసాగుతోంది. 


రాయల్ బెంగాల్ పెద్దపులి కోసం ప్రత్యేక గాలింపు..


తూర్పు గోదావరి జిల్లా నుంచి విశాఖ జిల్లాలో రెండు నెలలుగా మకాం వేసిన పులి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. పాద ముద్రల ఆధారంగా నాలుగేళ్ల వయసున్న రాయల్ బెంగాల్ పెద్దపులిగా తేల్చారు. ఇది చాలా తెలివైందని.. అయితే పులి సంచారంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్ వేసి ప్రత్యేక బృందాలను ఇక్కడ పెట్టినట్లు అటవీ శాఖ అధికారులు చెప్పారు. ఇది పగలంతా విశ్రాంతి తీస్కొని రాత్రి వేళలో ప్రయాణం చేస్తున్నట్లు గుర్తించారు. 


బాధితులకు నష్టపరిహారం.. 


అయితే పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామని అటవీ శాఖ అధికారులు వివరించారు. విజయనగరం జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతం సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏమాత్రం ఆద మార్చినా పులి ప్రాణాలు తీసేదాక వదలని... అది దృష్టిలో ఉంచుకొని ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. అయితే ఆ పులి ఏ దిశగా వెళ్తుందనేది అంచనా వేస్తున్నట్లు వివరించారు. పెద్దపులి సంచారం కోసం డ్రోన్లు కూడా ఏర్పాటు చేశామని చెబుతున్నారు. జీపీఎస్ సిస్టం కెమెరా ఆధారంగా పెద్దపులి ఆచూకీ తెలుసుకుంటామన్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. అలాగే పెద్దపులి వల్ల నష్టపోయిన వారికి పరిహారం కూడా చెల్లిస్తామని వివరించారు. 


తెలంగాణలో పశువులపై దాడులు..!


ఇటు తెలంగాణలోని నల్గొండ, మంచిర్యాలలో కూడా పులుల సంచారం జనంలో భయం పుట్టిస్తోంది. గుట్టల్లో సంచరిస్తున్న పులుల.. పశువులపై దాడులు చేస్తున్నాయి. ఇప్పటి వరకు రెండు జిల్లాల్లో పదుల సంఖ్యలో పశువులను, గొర్రెలను చంపేశాయి. అధికారులకు సమాచారం అందించినా వీటిని బంధించేందుకు చర్యలు చేపట్టడంలో కొతం ఆలస్యం జరుగుతోంది. తాజాగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో పులి సంచారం స్థానికులను భయపెడుతోంది. ఎదులబందం గ్రామంలో పులి దాడిలో ఆవు, లేగ దూడ ప్రాణాలు కోల్పోయాయి. పగ్ మార్క్స్ ఆధారంగా పశువులను పులే చంపినట్లు గుర్తించారు. 


ఇకనైనా పట్టుకుంటే మంచిది..!


అయితే మొదటి సారి పులి కనిపించిందని చెప్తే చేసినంత హడావుడి, ఆ తర్వాత చేయడం లేదని గ్రామస్థులు, సమీప ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. మరికొన్ని చోట్లు పులి సంచరిస్తోందని తెలిసినప్పటి నుంచి అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. గత రెండు నెలల క్రితం పులి కనపించిందని చెప్తే... పోలీసులు, అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించారని, కానీ మళ్లీ ఇప్పుడు చెప్తే మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పులి జాడ కనిపెట్టాలని కోరుతున్నారు.