విశాఖ నుంచి పరిపాలన సాగించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. వీలయినంత త్వరగా పరిపాలన రాజధానిని షిఫ్ట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, వసతి సదుపాయం, మంత్రులు, సీనియర్‌ అధికారులకు ట్రాన్సిట్‌ వసతి గుర్తింపు కోసం అధికారుల కమిటీని నియమించింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్షల కోసం సీఎం జగన్‌ విశాఖలో బస చేయాల్సి ఉన్నందున క్యాంప్‌ ఆఫీసు, బస గుర్తింపు కోసం కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌ రావత్ , సాధారణ పరిపాలన శాఖ మానవ వనరుల విభాగం కార్యదర్శులతో కమిటీని నియమించింది.


ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పని చేస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభివృద్ధి సమీక్షల కోసం విశాఖలో ముఖ్యమంత్రి బస చేయాల్సి ఉన్నందున ఆయనకు క్యాంప్‌ కార్యాలయం, బస ఏర్పాటుతో పాటు సీఎంవోలోని అధికారులకూ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా తరచూ ఆయా ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు, విభాగాధిపతులు ఆయా జిల్లాల్లో సమీక్షలు నిర్వహించాలని ఉందని సీఎస్ తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేయడంతో పాటు స్థానికంగా ఆయా అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపైనా చర్యలుతీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. 


విశాఖ నుంచి పరిపాలన


ఆరు నూరైనా విశాఖ నుంచి పరిపాలన సాగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ భావిస్తున్నారు. రాజధాని తరలింపు పై అనేక ఇబ్బందులు ఎదురవుతున్న ఆయన మాత్రం పట్టు వీడడం లేదు. పాలన వికేంద్రీకరణ చేసి తీరాలని, మూడు రాజధానులు ఏర్పడాలని బలంగా కోరుకుంటున్నారు. తాజాగా మరోసారి ఈ విషయాన్ని జగన్ వెల్లడించారు. దసరా తర్వాత విశాఖకు  మకాం మార్చబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం మాత్రం పరిపాలన వికేంద్రీకరణ విషయంలో తగ్గకూడదని నిర్ణయించింది. ఇటీవల రెండు మూడు సందర్భాల్లో జగన్ రాజధానుల అంశాన్ని బహిరంగంగానే వెల్లడించారు. ఆమధ్య ఢిల్లీలో పర్యటించినప్పుడు తాను త్వరలోనే విశాఖకు వెళ్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంలో కూడా  త్వరలోనే విశాఖకు ఫ్యామిలీని షిఫ్ట్ చేయబోతున్నట్లు ప్రకటించారు. 


అంతిమ నిర్ణయం జగన్ దే


వాస్తవానికి ఈ ఏడాది ఉగాది నుంచే జగన్ విశాఖకు షిఫ్ట్ అవుతారని చాలామంది భావించారు. రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉన్నా కూడా విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసి తాత్కాలికంగా పాలనను అక్కడి నుంచి కొనసాగించాలని జగన్ భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ నివాసం ఉండాలని ఆయన ఇష్టం మేరకే ఉంటుంది. దీనికి కోర్టులు కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చు. పైగా రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ఏది అనుకుంటే అది జరగొచ్చు. అందుకే తాను విశాఖకు షిఫ్ట్ అయిపోతున్నట్లు జగన్ ఓపెన్ గా చెప్పేస్తున్నారు.