Threatening Calls To Visakhapatnam MLA Velagapudi: విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. వరుసగా పలు నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్‌ రావడంతో ఆయన ఎంవీపీ కాలనీలోని పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి 8.30 గంటలు నుంచి రాత్రి 11 గంటలు మధ్యలో పలు నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్‌ వచ్చినట్టు ఎమ్మెల్యే వెలగపూడి ఫిర్యాదులో పేర్కొన్నారు. రంజన్‌ అనే పేరుతో బెదిరింపు కాల్స్‌ వచ్చినట్టు చెబుతున్నారు. ఫోన్‌ చేసిన వ్యక్తులు దుర్భాషలాడుతూ, చంపుతామని బెదిరిస్తున్నారని, తనకు తగిన రక్షణ కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించారు. ఫోన్‌ చేసిన బెదిరించిన వారిని గుర్తించి, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోలీసులను కోరారు. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.


హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన ఎమ్మెల్యే


విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మూడుసార్లు వరుసగా ఇక్కడ విజయం సాధించారు. ప్రజల మనిషిగా ఆయనకు పేరుతుంది. ఎవరు పిలిచినా పలుకుతారని, ఎవరింటికైనా వెళుతంటారని ఆయన గురించి చెబుతుంటారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఆయన విజయం సాధించారు. 2024 ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో వెలగపూడి రామకృష్ణబాబు పేరు ఉంది. దీంతో వరుసగా నాలుగోసారి విజయం సాధించే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే వెలగపూడికి బెదిరింపు కాల్స్‌ రావడం సర్వత్రా విస్మయ్యం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎవరు కాల్స్‌ చేయించారన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే దీనిపై పోలీసులకు విచారణ సాగిస్తున్న నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లో కాల్స్‌ చేసిన వారిని పోలీసులు గుర్తించే అవకాశముంది. ఇకపోతే, రానున్న ఎన్నికల్లో వెలగపూడి రామకృష్ణబాబుపై వైసీపీ బలమైన అభ్యర్థిని బరిలోకి దించుతోంది. ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. వీరిద్దరూ హోరాహోరీగా ప్రచారాన్ని సాగిస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ తరుణంలో ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్‌ రావడం ఆసక్తిని రేపుతోంది.