BYD SEAL Launch in India: బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్) భారతదేశంలో తన మూడో కారును మార్చి 5వ తేదీన లాంచ్ చేయనుంది. ఈ రాబోయే సీల్ ఈవీ గురించిన కీలక వివరాలు బయటకు వచ్చాయి. బీవైడీ సీల్ సీబీయూ యూనిట్‌గా భారతదేశానికి వస్తుంది. అంటే పూర్తిగా బయట దేశంలో తయారై ఇంపోర్ట్ ద్వారా మనదేశానికి రానుందన్న మాట. ఈ కారుకు సంబంధించి డీలర్లు ఇప్పటికే అనధికారిక బుకింగ్‌లు తీసుకోవడం ప్రారంభించారు. సీల్ భారతదేశంలో మొదటిసారిగా ఒక సంవత్సరం క్రితం 2023 ఆటో ఎక్స్‌పోలో లాంచ్ అయింది.
భారతదేశంలో బీవైడీ సీల్ 82.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో అందించనున్నారు. ఇది వెనుక చక్రాల డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో 570 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనున్నారు. వెనుక వైపు యాక్సిల్‌పై ఉన్న పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ 230 హెచ్‌పీ పవర్‌ని, 360 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేయగలదు. 2055 కిలోల బరువున్న ఈ కారు కేవలం 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది.
ఇతర బీవైడీ కార్ల మాదిరిగానే దీని బ్యాటరీ బీవైడీ పేటెంట్ బ్లేడ్ సెల్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది 150 కేడబ్ల్యూ వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. దీని కారణంగా ఈ కారు 37 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయనున్నారు. సాధారణ 11 కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్‌ని ఉపయోగిస్తే 0 నుంచి 100 శాతం ఛార్జ్ అవ్వడానికి 8.6 గంటలు పడుతుంది. ఈ స్పెక్స్ ఎంట్రీ-లెవల్ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్ కోసం అయినప్పటికీ డ్యూయల్ మోటార్ వేరియంట్ 530 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేయనుంది. 520 కిలోమీటర్ల రేంజ్‌తో ఏడబ్ల్యూడీ సిస్టంను కూడా అందించే అవకాశం ఉంది.
బీవైడీ సీల్ ఫీచర్లు ఇలా...
డిజైన్ గురించి చెప్పాలంటే ఈ కారు బీవైడీ "ఓషన్ ఈస్తటిక్స్" డిజైన్ లాంగ్వేజ్‌తో వస్తుంది. సీల్ కూపే లాంటి ఆల్ గ్లాస్ రూఫ్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, నాలుగు బూమరాంగ్ ఆకారపు ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్, వెనుకవైపు పూర్తి వెడల్పు ఎల్ఈడీ లైట్ బార్ వంటి డిటైల్స్‌ను కూడా పొందుతుంది.
లోపలి భాగంలో బీవైడీ సీల్ సెంటర్ కన్సోల్ తిరిగే 15.6 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను పొందుతుంది. ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవర్ కోసం హెడ్ అప్ డిస్‌ప్లే ఉంది. ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ చుట్టూ సెంట్రల్ ఏసీ వెంట్ ఉంది. దాని క్రింద డ్రైవ్ సెలెక్టర్, విభిన్న డ్రైవ్ మోడ్‌లను ఎంచుకోవడానికి స్క్రోల్ వీల్ ఉంటుంది. సెంటర్ కన్సోల్‌లో హీటెడ్ విండ్‌స్క్రీన్, ఆడియో సిస్టమ్ కోసం వాల్యూమ్ కంట్రోల్స్, రెండు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ల వంటి బేసిక్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి.
బీవైడీ సీల్ ధర ఎంత ఉండవచ్చు?
బీవైడీ సీల్ ఎక్స్ షోరూమ్ ధర దాదాపు రూ. 50 లక్షలుగా ఉండవచ్చని అంచనా. అంటే ఈ కారు రూ. 45.95 లక్షల ధర కలిగిన హ్యుందాయ్ అయోనిక్ 5తో పోటీపడుతుంది. అయోనిక్ 5 అనేది 217 హెచ్‌పీ పవర్ అవుట్‌పుట్ అందించే ఆర్‌డబ్ల్యూడీ మోటార్‌తో రానుంది. ఈ కారులో 72.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అందించనున్నారట. ఏకంగా 630 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనున్నట్లు సమాచారం.