Yuvagalam Tension :  టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర నూజివీడులో కొనసాగుతూండగా ఉద్రిక్తత ఏర్పడింది.  ఏలూరు జిల్లా నూజివీడులో  పలువురు వైకాపా కార్యకర్తలు తమ పార్టీ జెండాలతో అక్కడికి వచ్చారు. అధికార పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం లేదని టీడీపీ  నేతలు ఆరోపించారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నవైసీపీ  కార్యకర్తలను అడ్డుకునేందుకు టీడీరపీ  కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ  కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. అనంతరం ఇరు వర్గాలను చెదరగొట్టి పాదయాత్రను ముందుకు నడిపించారు.                                              


నూజివీడు మండలం తుక్కులూరు గ్రామం వద్ద కూడా  యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత ఏర్రడింది.  సైకో పోవాలి అని వస్తున్న పాటను ఆపాలంటూ  వైసీపీ నేతలు  పాదయాత్రపైకి దూసుకు వచ్చారు.  ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  వైఎస్సార్సీపీ నాయకుడు పాలడుగు విజయ్ కుమార్ ఇంటి పై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు.  రెండు బైక్ లు పాక్షికంగా ధ్వంసం అవడంతోపరి్సథితి ఉద్రిక్తంగామారింది.   ఇంటి భవన అద్దాలు పగిలిపోయాయి.  మీడియా ఫోన్లను టిడిపి యువగళం టీమ్ లాక్కుంది.  పోలీసులు వారితో గొడవపడి ఫోన్లు తెచ్చి ఇచ్చారు.  పోలీసులు ఇరువర్గాలని చదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు పోలీసులు.                            


194వ రోజు పాదయాత్ర నూజివీడు నియోజకవర్గంలో సాగుతోంది. నూజివీడు నియోజకవర్గం తుక్కులూరు గ్రామ దళితులు  యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ గ్రామంలో ఎస్సీ (SC)లు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారని, ప్రభుత్వం తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, డ్రైనేజీలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేసి ద్రోహం చేసిందన్నారు. అలాగే సాంఘిక సంక్షేమ హాస్టల్ తొలగించారని, గురుకుల పాఠశాలలో వసతులు లేవన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదని, ఎస్సీ, ఎస్టీలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తమ సమస్యలను పరిష్కరించాలని లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు.                              


దళితుల విషయంలో  ఏరుదాటాక తెప్పతగలేసిన చందంగా’ వ్యవహరిస్తున్నారని లోకేష్ విమర్శించారు.  పేద దళితుల ఉన్నత విద్యా భ్యాసం కోసం అమలు చేసిన అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని అడ్డగోలు నిబంధనలతో నిర్వీర్యం చేశారని విమర్శించారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు, హత్యలు చేయడం నిత్యకృత్యంగా మారిందని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తామని స్పష్టం చేశారు. ఎస్సీలకు పక్కా ఇళ్లు, దళితవాడల్లో డ్రైనేజీలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.