అందరినీ తిట్టి శుభాష్ ఇంటి కోడలిని ఇంట్లోకి రానిస్తాడు. అయితే భర్త చేసిన పనిని తప్పు పడుతుంది. ఇక కావ్య తెల్లారి పుట్టింటికి వెళ్లేందుకు రెడీ అవుతుంది. ఇదే విషయం గురించి రాజ్ ని అడిగితే మౌనంగా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు. సీతారామయ్య దంపతులు మాత్రం కూతురిగా నీ బాధ్యత నెరవేర్చమని ధైర్యం చెప్పి పుట్టింటికి వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. దీంతో అపర్ణ అహం దెబ్బతింటుంది. ఇంట్లో అందరికీ హుకుం జారీ చేస్తుంది. దీనికి కొనసాగింపే ఈ ప్రోమో..


కావ్య ఇంట్లో అందరికీ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. మొదటగా ఇంద్రాదేవికి ఇవ్వబోతే తీసుకోకుండా వెళ్ళిపోతుంది. ఇక అపర్ణ, రుద్రాణి చివరికి ధాన్యలక్ష్మి కూడా కావ్య పిలుస్తున్నా వినిపించుకోకుండా కాఫీ తీసుకోకుండా వెళ్లిపోతారు. ఈరోజు నుంచి ఈ ఇంట్లో తనతో ఎవరూ మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారన్నమాట అని కావ్య మనసులో అనుకుంటుంది. ఇక రుద్రాణి కావ్యని బాధపెట్టేలా మాట్లాడుతుంది. ఈ ఇంట్లో ఉండాలంటే మా వదిన కింద బానిసలా అయినా బతకాలి లేదంటే నీ పుట్టింటికి వెళ్ళి మట్టి పిసుక్కుంటూ బొమ్మలు చేసుకుని అయినా బతకాలి. నీకు ఉంది ఈ రెండే ఆప్షన్స్ అని దెప్పి పొడుస్తుంది. మరి దానికి కావ్య ఏం సమాధానం ఇస్తుంది? ఇంట్లో వాళ్ళు తనతో మాట్లాడతారా లేదా తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్లో చూడాల్సిందే.


Also Read: స్టైల్ మార్చి తల్లికి షాకిచ్చిన విక్రమ్- మాజీ భార్యకు ప్రపోజ్ చేయడానికి రెడీ అయిన నందు


నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..


రాజ్ ఆఫీసులో ఉండగా క్లయింట్ శరత్ ఫోన్ చేసి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం వేసిన డిజైన్స్ లో చిన్న చిన్న మార్పులు చేయాలని చెప్తాడు. అవసరమైతే కావ్యని తమతో మాట్లాడించమని అంటాడు. ఆ మాటకి రాజ్ కి కోపం వచ్చినా సైలెంట్ గా ఉంటాడు. శృతిని పిలిచి కావ్య వేసిన డిజైన్స్ లో మార్పులు చేయమని చెప్తాడు. దాని ఒరిజనల్ కాపీ మేడమ్ దగ్గరే ఉంటుంది, వాటిలో మార్పులు చేయడం తన వల్ల కాదని చెప్పేసరికి మిస్టర్ డిఫెక్ట్ కి కోపం వచ్చేసి తన మీద అరుస్తాడు. ఇక ఎట్టి పరిస్థితిలోని కళావతి సాయం అడిగేది లేదు డిజైన్స్ తనే వేసుకోవాలని రాజ్ నిర్ణయించుకుంటాడు.


కృష్ణమూర్తి బొమ్మలకి రంగులు వేయాలని ట్రై చేస్తుంటే చేతులు వణికి బ్రెష్ కిందపడిపోతుంది. కనకం వచ్చి ఏమైందని అడుగుతుంది. వయసు మీద పడుతున్న కారణంగా ఇక బొమ్మలకి రంగులు వేయలేనని బాధపడతాడు. అప్పుడే కావ్య వచ్చి తను ఉండగా అంత అవసరం ఏంటని ప్రశ్నిస్తుంది. రాత్రి ఇంట్లో అంత గొడవ జరిగి అల్లుడు బయటకి గెంటేసే పరిస్థితి వచ్చినా కూడా ఎందుకు మళ్ళీ పుట్టింటికి సాయం చేసేందుకు వచ్చావాని తల్లిదండ్రులు నిలదీస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళ అనుమతి తీసుకున్న తర్వాత వచ్చానని, కాంట్రాక్టర్ శ్రీనివాస్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నా, ఇంటి మీద ఉన్న అప్పు తీర్చాలన్నా తప్పదని కావ్య తల్లిదండ్రులకి సర్ది చెప్తుంది. అప్పు కూడా కావ్య నిర్ణయాన్ని సమర్థిస్తుంది.


Also Read: నారీ నారీ మధ్యలో నలిగిపోతున్న ఇగో మాస్టర్- క్యూట్ గా పోట్లాడుకున్న టామ్ అండ్ జెర్రీ


ఇంద్రాదేవి అపర్ణ చేసిన గొడవకు చాలా కోపంగా ఉంటుంది. తను వచ్చి పలకరించినా కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. దీంతో అపర్ణ అహం దెబ్బతింటుంది. మీ కోడలు మీరు చెప్పిన మాట వినలేదని మీకు ఇంత బాధగా అనిపిస్తే మరి నాకు ఎదురుచెప్పిన కళావతిని తను ఎలా క్షమిస్తానని అంటుంది. ఇంటి పరువు బజారున పడేసి, తనకి ఇష్టం లేని పనులు చేస్తూ ఎదురు చెప్తుంది కనుక తను కూడా కావ్యకి ఇదే శిక్ష వేస్తానని అంటుంది. ఇక నుంచి ఇంట్లో ఎవరూ కావ్యతో మాట్లాడతానికి వీల్లేదని హుకుం జారీ చేస్తుంది. ధాన్యలక్ష్మి సర్ది చెప్పడానికి చూస్తుంటే ఎక్కువ మాట్లాడితే మొట్టమొదటి సారి తోడికోడళ్ల మధ్య బేధాభిప్రాయలు వస్తాయని అపర్ణ తనని బెదిరిస్తుంది. దీంతో ధాన్యలక్ష్మి మౌనంగా ఉండిపోతుంది. మంచి నిర్ణయం తీసుకున్నావని రుద్రాణి తనని మెచ్చుకుంటుంది.