CM Jagan On Survey :   భూ వివాదాల పరిష్కారం కోసం మరో కీలక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రక‌టించారు. జ‌గనన్న భూ రక్ష, భూ హక్కు కింద సమగ్ర సర్వే ముగిశాక కూడా ట్రైబ్యునళ్లు కొనసాగనున్నట్టు ప్రకటించారు. ప్రతి మండల కేంద్రంలో భూ వివాదాల పరిష్కారం కోసం ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ ట్రైబ్యునల్స్ శాశ్వత ప్రాతిపదికన పని చేయనున్నాయి. సమగ్ర సర్వేపై సమీక్ష సందర్భంగా సీఎం జగన్‌ ఈ ఆదేశాలు ఇచ్చారు.


సమగ్ర సర్వే ముగిశాక కూడా ట్రైబ్యునళ్లు కొనసాగింపు ! 


సర్వే సందర్భంగా కూడా తలెత్తే వివాదాల పరిష్కారానికి సరైన యంత్రాంగం ఉండాలని అందుకే ట్రైబ్యునల్‌ వ్యవస్థ తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు సీఎం జగన్. మొబైల్‌ ట్రైబ్యునల్‌ యూనిట్లు ఉండాలన్న సీఎం... దీనిపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు. భూ వివాదాల పరిష్కారంపై రాష్ట్రంలో అత్యుత్తమ వ్యవస్థ ఉండాలన్నారు. అందుకే శాశ్వత ప్రాతిపదికన ప్రతి మండల కేంద్రంలో కూడా భూ వివాదాల పరిష్కారానికి ట్రైబ్యునల్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల న్యాయ సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కారమవుతాయని... హక్కులు పొందే వీలుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 


సర్వే ప్రక్రియలో నాణ్యత  చాలా ముఖ్యమని స్పష్టం !


వివాదాల్లో ఉండి ఏళ్ల తరబడి హక్కులు పొందలేని పరిస్థితి ఉండకూడదన్నారు సీఎం జగన్. సర్వే సందర్భంగా ప్రభుత్వంతో వివాదాలు, వ్యక్తిగత వివాదాలు గుర్తించాలని సూచించారు. సర్వే నంబర్ల జాబితాలో ఈ వివాదాలను కూడా పేర్కొనాలన్నారు. దీని వల్ల స్థలం కొనుగోలుదార్లకు ప్లేస్‌ లీగల్‌గా క్లియర్‌గా ఉందా? లేదా? అన్నది తెలుస్తుందని వివరించారు. అదే సమయంలో ఆ వివాదాలను పరిష్కరించే ప్రయత్నం కూడా సమాంతరంగా జరగాలని తెలిపారు. సర్వే ప్రక్రియలో నాణ్యత అనేది చాలా ముఖ్యమని స్పష్టం చేశారు సీఎం. వివాదాల పరిష్కారంలో కూడా అలాంటి క్వాలిటీతో కూడిన ప్రక్రియ ఉండాల‌న్నారు. 


అవినీతి అవకాశం లేకుంగా సమగ్ర సర్వే ! 


సమగ్ర సర్వే సందర్భంగా వచ్చే అప్పీళ్లపై థర్డ్‌పార్టీ పర్యవేక్షణ కూడా ఉండాలన్న సీఎం... దీనివల్ల హక్కుదారులకు ఎలాంటి నష్టం జరగకూడదని సూచించారు. తప్పులకు పాల్పడే సిబ్బందిపై కూడా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. థర్డ్‌పార్టీ పర్యవేక్షణ వల్ల పక్షపాతం, వివక్ష, అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుందని సిబ్బందిలో కూడా జవాబుదారితనం మెరుగుపడుతుందన్నారు. ఎవరైనా ఒక వ్యక్తి  తమ భూమిలో సర్వే కావాలని దరఖాస్తు చేసుకుంటే... కచ్చితంగా సర్వే చేయాలి, నిర్ణీత సమయంలోగా సర్వే చేయకుంటే... సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం ఒక ఎస్‌ఓపీ రూపొందించాలని సీఎం ఆదేశించారు. 


వచ్చే ఏడాది డిసెంబర్‌కు సమగ్ర సర్వే పూర్తి !


ఇక సర్వేలో ఏరియల్‌ ఫ్లయింగ్, డ్రోన్‌ ఫ్లయింగ్‌ నెలవారీ లక్ష్యాలను పెంచాలన్నారు. నెలకు వేయి గ్రామాలను చొప్పున ఇప్పుడు చేస్తున్నామన్న అధికారులు... ఈ లక్ష్యాన్ని పెంచాలని సూచించారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో కూడా సర్వేను వేగవంతం చేయాలన్నారు. 2023 సెప్టెంబరు నెలాఖరు నాటికి సమగ్ర సర్వేను పూర్తి చేస్తామన్న అధికారులు... సమగ్ర సర్వే ప్రక్రియ సమర్థవంతంగా సాగడానికి ప్రఖ్యాత లీగల్‌ సంస్థల భాగస్వామ్యాన్ని కూడా తీసుకుంటున్నట్టు తెలిపారు. దీనివల్ల క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని పేర్కొన్నారు.