Black Tiger: ఒడిశాలోని సిమిలాపాల్ నేషనల్ పార్కులో అరుదైన పులి కనిపించింది. నల్లగా ఉండే ఈ పులికి నారింజ రంగు చారలు ఉన్నాయి. ఈ అరుదైన నల్లపులి తను రెగ్యులర్‌గా తిరిగే ప్రాంతాన్ని ఈజీగా గుర్తిస్తుంది. సాధారణంగా పులుల భాష పులులకే తెలుస్తుంది. మనం అడవికి వెళ్లినప్పుడు అక్కడి చెట్లపైనా ఏమైనా గుర్తులు ఉంటే మనం అంతగా పట్టించుకోం. ఆ చెట్లు ఆ అడవిని చూస్తూ అలా ముందుకు సాగుతుంటాం. కానీ అటుగా ఏదైనా పులి వస్తే మాత్రం చెట్లపై ఉన్న గుర్తులను గుర్తిస్తుంది. తన లాంటి మరో పులి ఆ ఏరియాలో ఉందని.. అది ఆ పులి అడ్డా అని తెలుసుకుంటుంది. 



తన భూభాగమని తెలిపేందుకు మార్కు వేస్కుంటున్న నల్లపులి..


వీడియోలో కనిపిస్తున్న ఈ నల్ల పులి అక్కడున్న ప్రాంతమంతా తన భూభాగం అని చెప్పేందుకు.. ఓ చెట్టుపై తన మార్క్ వేసింది. పదే పదే తన గోర్లతో రక్కుతూ... చెట్టు బెరడును తీసేస్తోంది. తరచుగా వన్య ప్రాణుల వీడియోలను షేర్ చేసే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఈ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ నెట్టింట వైరల్ గా మారింది. సుషాంత్ నంద ఈ వీడియోను పోస్ట్ చేయడంతో పాటు.. పులులు భారతదేశ అడవుల సుస్థిరతకు చిహ్నం అని రాసుకొచ్చారు.  


పులుల నలుపు రంగుకు కారణం అదే..


ఈ నలుపు రంగు పులులను 2007లో ఎస్టీఆర్ లో మొదటి సారిగా కనుగొన్నట్లు పర్వీన్ కస్వాన్ అనే వ్యక్తి తెలిపారు. ఈయన కూడా ఈ నల్లపులి వీడియోని షేర్ చేశారు. అంతే కాదండోయ్ ప్రపంచంలోనే నల్లపులులు కనిపించే ఏకైక ప్రదేశం ఒడిశాలోని సిమిలాపాల్ నేషనల్ పార్కు. అక్కడి పులులు.. రాయల్ బెంగాల్ పులుల కంటే భిన్నంగా కనిపిస్తాయి. వీటి శరీరంపై నల్లటి చారలు దట్టంగా పరుచుకొని ఉంటాయి. ఒక్కోసారి పూర్తి నలుపు వర్ణంలోనూ కనిపిస్తాయని అన్నారు. అయితే వీటి రంగులో మార్పుకు కారణం ట్రాన్స్ మెంబ్రెన్ అమినోపప్టిడేస్ క్యూ అనే జన్యువు ఉత్పరివర్తనం అని చెప్పారు. దీని వల్లే ఈ పులులకు నలుపు రంగు వచ్చినట్లు చెప్పారు. 


సిమిలాపాల్ లో కేవలం 8 మాత్రమే ఉన్నాయా..!


సిమిలాపాల్ టైగర్లు.. ఇతర జాతుల పులులతో సంపర్కం జరపవని, అందుకే అవి అంతరించిపోయే ప్రమాదం అధికంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2018 లెక్కల ప్రకారం భారత్ లో 2 వేల 967 పులులు ఉన్నాయి. సిమిలాపాల్ లో తీసిన ఫొటోల ఆధారంగా కేవలం 8 నల్ల పులులు మాత్రమే ఉన్నాయని తేలింది. అయితే ప్రస్తుతం ఈ నల్లపులి వీడియో నెట్టింటిని షేక్ చేస్తుంది.