Skill TDP Website : ‘స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లోఎలాంటి అవినీతి జరగలేదని నిరూపించే వాస్తవాలను ప్రతిరోజు ప్రజల ముందు ఉంచుతున్నాం. చంద్రబాబునాయుడి లాంటి జాతీయ నాయకుడు తప్పుచేయలేదనే వాస్తవం ప్రపంచవ్యాప్తంగా తెలియాలనే అన్ని ఆధారాలతోకూడిన వాస్తవాలను పబ్లిక్ డొమైల్ పెట్టాలని నిర్ణయించుకున్నాం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ‘స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్’ కు సంబంధించి పూర్తి వాస్తవాలతో కూడిన వెబ్ సైట్‌ను ఆవిష్కరించారు. స్కిల్ స్కామ్ కేసులో ప్రజలకు వాస్తవాలు తెలియ చెప్పడానికే apskilldevelopmenttruth.com వెబ్ సైట్‌ను ప్రారంభించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.
వెబ్ సైట్ లోని వివరాలు పరిశీలిస్తే, చంద్రబాబు ఏంచేశారో, యువత భవితకోసం ఎంతగా తపనపడి, ఎంత ప్రణాళికాబద్ధంగా పనిచేశారో, ఈ ప్రభుత్వం ఏవిధంగా దుష్ప్రచారం చేస్తుందో ప్రజలకు తెలుస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు. చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టారు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియాలని ఉద్దేశ్యంతో వెబ్‌సైట్ ఓపెన్ చేశాం. నవంబర్ 2014 నుంచి జరిగిన అన్ని అంశాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. ఏపీ కంటే ముందు చాలా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అమలైంది. కార్యక్రమం బాగా అమలైందంటూ కేంద్రం కూడా అవార్డులు ఇచ్చింది. 2,17,500 మంది యువత ఐదు క్లస్టర్ల ద్వారా ట్రైనింగ్ తీసుకున్నారు. 65 వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు వచ్చాయని అచ్చెననాయుడు తెలిపారు.
వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై వాస్తవాలు తెలియజేయాలని వెబ్‌సైట్ తీసుకొచ్చాం. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నిరసనకు దిగుతున్నారు. రూ.380 కోట్లు అవినీతి జరిగిందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పటి నుంచి వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు. సంబంధం లేని కేసులో ఇరికించారు. హైదరాబాద్‌లో.. విజయవాడలో స్వచ్ఛందంగా ఆందోళనలకు దిగారు. రాష్ట్ర విభజన సమయంలో వచ్చినట్లు రోడ్డుపైకి వస్తున్నారు. జనసేన పార్టీతో ఏ విధంగా కలిసి ముందుకు వెళ్లాలన్న దానిపై త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తాం. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో జనసేన, టీడీపీ నాయకులు కలిసి ఉమ్మడి పోరాటం చేస్తున్నారని స్పష్టం చేశారు.
క్విడ్ ప్రోకో పదాన్ని తెలుగువారికి పరిచయం చేసింది ఎవరో ప్రత్యేకంగా చెప్పాలా? ఈ ప్రభుత్వ పతనం మొదలైంది కాబట్టే ఇంతపెద్ద తప్పు చేసింది అని అచ్చెన్నాయుడు అన్నారు. స్కిల్ స్కామ్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా, చంద్రబాబునాయుడికి, అచ్చెన్నాయుడికి, లోకేశ్ కు ఫలానా వారి నుంచి డబ్బులు వచ్చాయని నిరూపించకుండా నోటికొచ్చినట్టు ఎలా ఆరోపణలు చేస్తారు? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి పతనం మొదలైంది. కాబట్టే ఇంత తప్పుడు పనికి పాల్పడ్డారు. ప్రజా నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేసి, జైలుకు పంపినందుకు ఇంతకింత మూల్యం చెల్లించు కుంటారు అని హెచ్చరించారు.