Tiger Death : అడవిలో ఉంటున్నా పెద్ద పులులను వేటగాళ్లు వదిలి పెట్టడం లేదు. వాటి సంరక్షణ కోసం ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చు పెడుతున్నాయన్న సంగతినీ పట్టించుకోవడం లేదు . ప్రపంచవ్యాప్తంగా అంతరించి పోతాయేమోనన్న ఆందోళనలో .. ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్న విషయం తెలిసినా వాటి అంతు చూసేందుకు వెనుకాడటం లేదు. తాజాగా నల్లమల అటవీ ప్రాంతంలో పులుల వేటగాళ్లు వేసిన ఉచ్చుకు చిక్కుకుని ఓ పెద్దపులి చనిపోయింది. అది పులుల కోసమే ఏర్పాటు చేసిన ఉచ్చు అని అటవీ అధికారులుచెబుతున్నారు.
పెద్ద పులి కోసమే ఉచ్చు వేసిన వేటగాళ్లు
కర్నూలు జిల్లా వెలుగోడు మండలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తూ ఉంటాయి. వాటి రక్షణ కోసం ఏర్పాట్లు చేశారు. ఎవరూ వేటాడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే వేటగాళ్లు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త దారులు వెదుక్కుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో వేటగాళ్లు ఉచ్చులో చిక్కుకొని పెద్దపులి మృతి చెందింది. ఆత్మకూరు అటవీ డివిజన్ వెలుగోడు రేంజి పరిధిలోని గుండ్ల మల్లెలమ్మ వాగు సమీపంలో వేటగాళ్లు పులి కోసం ఉచ్చు వేశారు. ఈ ఉచ్చుకు చిక్కుకొని పెద్దపులి మృతి చెందింది. ఆ పులి వయసు నాలుగేళ్ల నుంచి ఎనిమిదేళ్ల వరకూ ఉండవచ్చని అటవీ శాాఖ అధికారులుచెబుతున్నారు.
ఉచ్చులో చిక్కుకుని చనిపోయిన పులి
గుండ్ల మల్లెలమ్మ వాగు వద్ద ఓ పెద్ద పులి ఉచ్చులో ఉండడం చూసి మత్యకరులు ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆ పెద్ద పులి మృతి చెందింది. నల్లమలలో అడుగుల ఆధారంగా ఎన్ని పులులు ఉన్నాయో ప్రతీ ఏడాది లెక్కిస్తారు. ఈ క్రమంలో పులులకు సంఖ్య కేటాయిస్తారు. ఇలా ఆ పులి అడుగు .. వేలి ముద్రల ఆధారంగా మృతి చెందిన పెద్దపులిని T48 ( F) గా గుర్తించారు. పులిని చంపడానికి ఉపయోగించిన ఉచ్చును స్వాధీనం చేసుకున్నారు. వేటగాళ్ల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి త్వరలోనే వారిని పట్టుకుంటామని డిఎఫ్ఓ తెలిపారు.
వేటగాళ్లను పట్టుకుంటామన్న అటవీ అధికారులు
వెలుగోడు రిజర్వాయర్ కు సమీపంలో పులి చనిపోయినట్లు చూసి వెంటనే చేపల వేటకు వెళ్లి నటువంటి మత్స్యకారులు గమనించి అటవీ సిబ్బందికి సమాచారాన్ని తెలియజేయడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి వేటకు సంబంధించి వాహనాలకు సంబంధించినటు వంటి బ్రేక్ ఉచ్చులను వాడినట్టు అధికారులు తెలిపారు. జంతు సంరక్షణ చట్టానికి సంబంధించి జంతువులను ఎవరైతే ఈ విధంగా హింసించి చంపుతున్నారు వారి మీద కఠినమైన శిక్షలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అయితే వేటగాళ్లు ఉచ్చులతో సహా నేరుగా అడవిలోకి వచ్చి ఉచ్చు వేసి పులిని చంపే వరకూ ఆటవీ అధికారులు గుర్తించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పెద్దపులి చర్మం సహా వివిధ శరీర భాగాలకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. అనేక మంది స్మగ్లర్లకు ఇదే పని. ఈ కారణంగానే పెద్ద పులులపై నల్లమలలో వేటగాళ్లు మాటు వేసినట్లుగా అనుమానిస్తున్నారు.