లాస్ట్ బాల్ సిక్స్ కొట్టినంత హ్యాపీగా ఉన్నారు ఏపీలోని కొంత మంది ఉద్యోగులు. అదేంటి .. అందరూ రోడ్ల మీదకు వచ్చి .. తమకు పాత జీతాలే కావాలని ఆందోళనలు చేస్తున్నారు.. సమ్మెకు కూడా వెళ్తున్నారు కదా అని డౌట్ ావొచ్చు. కానీ ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో ఓ హామీ మాత్రం రిటైరయ్యే వారికి గొప్ప వరంగా మారింది. పదవీ విరమణ వయసును రెండేళ్లు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి నెలాఖరు రోజు అంటే జనవరి 31వ తేదీన రిటైరయ్యే వారికి వరంగా మారింది. కానీ ఉత్తర్వులు రాకపోవడంతో టెన్షన్ పడ్డారు. కానీ చివరి రోజు చివరి క్షణంలో ప్రభుత్వం వారికి ఊరటనిచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. 2022 జనవరి 1నుంచి ఈ ఉత్వర్వులు అమల్లోకి రానున్నాయి. అంటే ఈ నెలలో ఎవరు రిటైర్ కావాల్సి ఉన్నా.. వారి రిటైర్ అవ్వాల్సిన పనిలేదు. మరో రెండేళ్లు ఉద్యోగం చేసుకోవచ్చు. ఈ మేరకు ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం సంతకం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగు రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు రిటైర్మెంట్ వయసు పెంపును అడగలేదు. ఎక్కడా డిమాండ్ చేయలేదు. కానీ అనూహ్యంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ ఉద్యోగి జీతభత్యాలు రిటైరయ్యే స్థాయిలో అత్యధికం ఉంటాయి. ఆ అత్యధిక జీతాలతో మరో రెండేళ్లు ప్రభుత్వం సర్వీసు కొనసాగిస్తుంది. ఇది రిటైరయ్యే ఉద్యోగులకు ఎంతో లబ్ది కలిగిస్తుది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం మానవుని సగటు జీవిత కాలం 73 ఏళ్లు పెరిగిందని.. అదే భారతీయుల సగటు జీవితకాలం 70 ఏళ్లకు పెరిగిందని .. అలాగే సాధారణ ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగైనందున ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచుతున్నట్లుగా ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. సీనియర్ ఉద్యోగుల అనుభవముల, నైపుణ్యాన్ని వినియోగించుకునేందుకు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నట్లుగా తెలిపారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు రిటైరయ్యే వారికి రెండేళ్ల సర్వీసు పెరగడంతో వారు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన సమ్మెలో పాల్గొనే అవకాశం లేదని భావిస్తున్నారు. వారికి ఉద్యోగ సంఘాలు చెబుతున్నట్లుగా కోల్పోయే మొత్తం కన్నా ఈ రెండేళ్లలో అత్యధిక వేతనం లభించనుంది.