పదేళ్ల లోపు సర్వీసు ఉన్న వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చిందని బిజెపి శాసనమండలి పక్షనేత పివిఎన్ మాధవ్ ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ అమలు మాట దేవుడెరుగు ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పీకేసేందుకు కంకణం కట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నివెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ నిర్ణయం...


గుట్టుచప్పుడు కాకుండా కుట్రపూరిత ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిందని మాదవ్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు  ప్రభుత్వం అన్ని శాఖలకు ఉత్తర్వులు పంపినట్లు సమాచారం అందుతుందని ఆయన  పేర్కొన్నారు. పై నుంచి అందిన ఆదేశాల అమలుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని వివరించారు. 


రాష్ట్ర వ్యాప్తంగా పదేళ్లలోపు సర్వీసు ఉన్న 2.40 మంది ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారని పేర్కొన్నారు. ఏ రోజైనా తమ ఉద్యోగం రెగ్యులర్‌ అవుతుందని ఆశించిన వీరందరూ ఇప్పుడు తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనలో చిక్కుకున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కష్టాలు తీరుస్తామని జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారని, 'సమాన పనికి- సమాన వేతనం' ప్రాతిపదికన న్యాయం చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని మాదవ్ గుర్తు చేశారు. అయితే అందుకు భిన్నంగా వైసీపి ప్రభుత్వం  వ్యవహరిస్తోంని మాధవ్  విమర్శించారు.

హడావిడిగా ఉత్తర్వులు ఎందుకు...


ప్రభుత్వ ఉత్తర్వులలో ప్రభుత్వం నుంచి ఆదేశాల ప్రకారం పది సంవత్సరాలు పూర్తి కాని వారినందరిని తక్షణమే సర్వీసు నుంచి నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారని, ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని జెడిడబ్య్లుఎలను, పిఎఓలను ఆదేశించినట్లుగా సమాచారం ఉందని తెలిపారు. తొలగించిన వారిలో మూడు సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల తొమ్మిది నెలల సర్వీసును పూర్తి చేసిన వారు కూడా ఉన్నారని పది సంవత్సరాల సర్వీసుకు ఒక్క రోజు తక్కువైనా నిలిపివేయక తప్పని పరిస్ధితిలు  ఉత్వర్వులు ద్వారా  ఏర్పడుతోందని, ఉద్యోగాలను  ఊడగొట్టేందుకు  వైసీపి ప్రభుత్వం  కంకణం కట్టుకుందా అని ప్రశ్నించారు.                         


విభజన తరువాత నియామకాలు...
గత ప్రభుత్వం హయాంలో సమైక్య రాష్ట్ర విభజన అనంతరం  2014-19 మధ్యలో 90 వేల మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా రిక్రూట్‌ అయ్యారని, వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిక్రూట్‌ మెంట్‌ కోసం ఏకంగా 'ఆప్కాస్‌' అనే వ్యవస్థ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. దీని ద్వారా రాష్ట్ర కేంద్రంతోపాటు జిల్లాలో కూడా నియామకాలు చేసిందని, వీరందరు తమ ఉద్యోగాలు రెగ్యులర్‌ అవుతాయని ఆశిస్తూ ఉండగా జగన్ సర్కార్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఏంటిని నిలదీశారు. తాజా ఉత్తర్వులు వీరికి శరాఘాతంగా మారాయని, రూ.16 వేల నుంచి రూ.23 వేలలోపు స్వల్ప జీతాలు ఇస్తున్నారని, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ వర్గాలకు చెందిన వారే అత్యధికంగా ఉన్నారని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను గుదిబండగా భావిస్తోందని ప్రభుత్వంపై మాధవ్ విమర్శలు చేశారు.


అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ఉద్యోగిని తొలగించం, సమానపనికి సమాన వేతనం, ఇచ్చి ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాం' అని ప్రతిపక్ష నాయకునిగా జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చి, నేడు అందుకు భిన్నంగా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు మాధవ్‌. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఉన్న ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నిస్తుండటం తగదన్నారు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల విషయంలో జోక్యం చేసుకుని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రిని  బిజెపి శాసనమండలి పక్షనేత పివిఎన్ మాధవ్ డిమాండ్ చేశారు.