Andhra News:  ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.  సూర్యనారాయణను  సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ప్రొసీడింగ్స్ విడుదల చేసింది. సూర్యనారాయణపై క్రమశిక్షణా చర్యలు పూర్తిగా తీసుకునే వరకూ సస్పెన్షన్ ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ ప్రొసీడింగ్స్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం సూర్యనారాయణ పరారీలో ఉన్నారు.           

                                                                           
  


2023, మే 30వ తేదీన విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌లో రిజిస్టర్ అయిన ఓ కేసులో ఏ-5గా సూర్యనారాయణ ఉన్నారు. 2019 నుంచి 2021 మధ్య కేఆర్‌ సూర్యనారాయణ, మెహర్ కుమార్, సంథ్య, వెంకట చలపతి, సత్యనారాయణలతో కలిసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపణలు ఉన్నాయి. సూర్యనారాయణ మినహా మిగిలిన నలుగురిని కస్టడీలోకి తీసుకొని విచారించగా.. ఏ-5 సూర్యనారాయణతో కలిసి వారు కుట్ర చేసిన వివరాలు ప్రొసీడింగ్స్‌లో వెల్లడించారు.             

                                                       


ఏపీ కమర్షియల్ ట్యాక్స్ అసోషియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న సూర్యానారాయణతో కలిసి ఇతర నిందితులు భారీ మొత్తంలో వ్యాపారులు నుంచి తనిఖీల పేరుతో డబ్బులు వసూలు చేశారని తెలిపింది. సూర్యనారాయణ ఉద్యోగంలో కొనసాగితే విచారణ సజావుగా సాగదని ప్రభుత్వనికి కూడా హాని కలిగే అవకాశం ఉందంటూ ప్రొసీడింగ్స్‌లో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే విచారణకు సహకరించకపోవడంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డర్ విడుదల అయిన నాటి నుంచి ఆయనపై క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకూ సస్పెన్సన్ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సస్పెన్సన్ కాలం మొత్తం హెడ్ క్వార్టర్‌ను ముందస్తు అనుమతి లేకుండా వదలకూడదంటూ ఉత్తర్వుల్లో తెలిపింది.        

                    


ఈ కేసుల్లో సూర్యనారాయణ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే ఆయనను పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదు. ఆయన కూడా ఆజ్ఞాతం నుంచి బయటకు రాలేదు. ఉద్యోగసంఘం నేతగా  సమస్యలపై పోరాడారు. గవర్నర్‌కూ ప్రభుత్వం పై ఫిర్యాదు చేశారు. అందుకే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఉద్యోగసంఘం నేతలు ఆరోపిస్తున్నారు.