Pilli Subhash :  వైఎస్ఆర్‌సీపీలో అంతర్గత పంచాయతీలు  కాక రేపుతున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో టిక్కెట్‌ను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఖరారు చేయడంతో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫైర్ అవుతున్నారు. అక్కడ్నుంచి తాను కానీ.. తన కుమారుడు కానీ పోటీ చేసి తీరుతామని ఆయన ప్రకటించారు. సీఎం జగన్ కు కూడా అదే చెప్పానని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఇంటికి తెలుగుదేశం పార్టీ నేతలు వెళ్లి భేటీ కావడం చర్చనీయాంశమయింది. రెడ్డి సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కొంత మంది నేతలు పిల్లి సుభాష్ ఇంటికి వెళ్లి  మాట్లాడారు. పలు రాజకీయఅ అంమశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తమ భేటీ రాజకీయాల కోసం కాదని.. .బోస్ పెద్ద కమారుడిని పరామర్శించడానికి వచ్చామని వారు చెబుతున్నారు. 


పార్లమెంట్ సమావేశాల తర్వాత వైసీపీకి..రాజ్యసభ సభ్యత్వానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ మెయిలింగ్ కు లొంగేది లేదని.. మంత్రి వేణునే అక్కడ్నుంచి పోటీ చేస్తారని వైసీపీ వర్గాలు సంకేతాలిస్తున్నాయి. మరో వైపు అదే నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు తోట త్రిమూర్తులు కూడా మధ్యే మార్గంగా తనకు టిక్కెట్ కేటాయించాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తు తం ఆయన మండపేట నియోజకవర్గానికి ఇంచార్జ్ గా ఉన్నారు. ఆయన కూడా రేసులోకి రావడంతో రామచంద్రాపురం వైసీపీ పరిస్థితి మరింత గందరగోళంగా మారింది.                               


పిల్లి సుభాష్ చంద్రబోస్ సుదీర్ఘ కాలంగా రామచంద్రాపురం నుంచే రాజకీయాలు చేస్తున్నారు. ఓ సారి ఇండిపెండెంట్ గా కూడా గెలిచారు.  జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఆయనతో పాటు నడిచారు. అయితే గత ఎన్నికల్లో ఆయనకు రామచంద్రాపురం టిక్కెట్ కాకుండా.. మండపేట టిక్కెట్ కేటాయించారు. రామచంద్రాపురం చెల్లుబోయిన వేణుకు ఇచ్చారు. ఆయన నియోజకవర్గానికి స్థానికేతరుడు. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన వారు.  రామచంద్రాపురంలో విజయం సాధించడంతో ఆయన అక్కడే రాజకీయంగా కొనసాగాలనుకుంటున్నారు. కానీ తన నియోజకవర్గాన్ని తనకు అప్పగించాలని పిల్లి సుభాష్ కోరుతున్నారు.                                     


పిల్లి సుభాష్‌కు ప్రత్యర్తిగా తోట త్రిమూర్తులు టీడీపీలో ఉండేవారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వైసీపీలో చేరారు. ఆయనకు మండపేట ఇంచార్జ్ గా ఇచ్చారు. రాజ్యసభకు వెళ్లిన పిల్లి సుభాష్‌కు నియోజకవర్గం లేకుండా పోయింది. ఇలా అయితే తన వారసులకు రాజకీయ భవిష్యత్ లేకుండా పోతుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. అందుకే  ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెబుతున్నారు.  ఈ క్రమంలో ఆయనతో టీడీపీ నేతలు భేటీ కావడంతో.. రాజకీయం  కీలకంగా మారింది.