AP News :  ఆంధ్రప్రదేశ్‌లో   జూనియర్‌ డాక్టర్ల  స్టై ఫండ్‌ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎం.టీ   కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఇంటర్నీల్‌కు రూ.22,527 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే పీజీ డాక్టర్లకు మొదటి సంవత్సరం వారికి రూ.50,686, రెండవ సంవత్సరం వారికి రూ.53,503, రూ.మూడవ సంవత్సరం వారికి రూ.56,319లు ఇస్తారు.  పీజీ డిప్లమా వారికి కూడా అదే విధంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్‌లకు స్టై ఫండ్‌ గా మొదటి సంవత్సరం రూ.56,309, రెండోవ సంవత్సరం రూ.59,135, మూడవ సంవత్సరం రూ.61,949స్టై ఫండ్‌ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. వీరితో పాటు ఎండీఎస్‌ కోర్సు చేసే వారికి మొదటి సంవత్సరం రూ.56,686 , రెండోవ సంవత్సరం వారికి రూ.53,503 మూడవ సంవత్సరం వారికి రూ.56,519ల స్టై ఫండ్‌ పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు.  


స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసు ఇచ్చిన జూనియర్ డాక్టర్ల సంఘాలు


స్టైఫండ్ పెంచాలని చాలా కాలంగా జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు.  తమకు చెల్లించే స్టైఫండ్ ను 42 శాతం పెంచాల్సిందేనని   లేదంటే ఈ నెల 26 నుంచి ఔట్ పేషెంట్ సేవలను బహిష్కరిస్తామని ఇప్పటికే ప్రకటించారు.  ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నెల 25వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని, 26వ తేదీ నుంచి ఓపీ విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు.   అప్పటికీ స్పందించకుంటే 27వ తేదీ నుంచి అత్యవసర సేవలు తప్ప మిగతా వైద్య సేవలన్నీ బహిష్కరిస్తామని హెచ్చరించారు. సమ్మెలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన జూనియర్ డాక్టర్లు పాల్గొంటారని చెప్పారు. అయితే ప్రభుత్వం వెంటనే స్పందించింది. 21 వ తేదీనే స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 


కనీసం 40 శాతం పెంచాలని డిమాండ్ 


 మిగతా రాష్ట్రాల్లోని జూనియర్ డాక్టర్లకు అందించే స్టైఫండ్ తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో చాలా తక్కువ అని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు.  హౌస్ సర్జన్లకు ఇతర రాష్ట్రాల్లో రూ.30 వేలు, స్పెషాలిటీ పీజీలకు రూ.65 వేలు, సూపర్ స్పెషాలిటీ పీజీలకు రూ.80 వేలు చెల్లిస్తున్నారని అంటున్నారు. రాష్ట్రంలో మాత్రం హౌస్ సర్జన్లకు రూ.19 వేలు, స్పెషాలిటీ పీజీలకు రూ.44 వేలు, సూపర్ స్పెషాలిటీ పీజీలకు రూ.53 వేలు మాత్రమే ఇస్తున్నారని వీటిని నలభై శాతానికిపైగా పెంచాలని కోరుతున్నారు.వీరి డిమాండ్‌తో పోలిస్తే ప్రభుత్వం ఇప్పుడు పెంచిన మొత్తం స్వల్పమే. దీనిపై జూనియర్ డాక్టర్లు ఎలా స్పందింస్తారో చూడాల్సి ఉంది. 


సమస్యలపై పోరాటానికి ప్రతీ ఏడాది రోడ్డెక్కుతున్న జూడాలు !


జూనియర్ డాక్టర్ల పోరాటం.. సమ్మె చేయడం దాదాపుగా ప్రతీ ఏడాది సాగుతూనే ఉంటుంది.  కొన్నాళ్లు సమ్మె చేసిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు సమ్మెను విరమిస్తారు. అయితే వాటిని అమలు చేయలేదని మళ్లీ ఆందోళన చేస్తారు. ఈ సారి మాత్రం ముందుగానే సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది.