Shivraj Patil On Jihad:


బుక్ లాంచ్ ఈవెంట్‌లో పాటిల్..


కాంగ్రెస్ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిహాద్‌ గురించి ఖురాన్‌లోనే కాకుండా భగవద్గీతలోనూ ప్రస్తావించారని, అటు క్రిస్టియానిటీలోనూ ఈ కాన్సెప్ట్‌ ఉందని కామెంట్ చేశారు. ఢిల్లీలో ఓ బుక్ లాంచ్ ఈవెంట్‌కు వెళ్లిన ఆయన...ఇలా మాట్లాడారు. మహా భారతంలో కురుక్షేత్ర యుద్ధంలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడూ "జిహాద్" గురించి చెప్పాడని చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగుతోంది. భాజపా ఈ కామెంట్స్‌పై తీవ్రంగా స్పందించింది. "కాంగ్రెస్ హిందూ విద్వేషి" అని మండి పడింది. ఓటు బ్యాంక్ రాజకీయాలు అని విమర్శించింది. 


పటేల్ ఏమన్నారంటే..


"ఇస్లాం మతంలో జిహాద్‌ గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. ఇది కేవలం ఖురాన్‌లోనే కాదు. భగవద్గీతలోనూ ఉంది. శ్రీకృష్ణుడు స్వయంగా జిహాద్ గురించి అర్జునుడికి చెప్పాడు. క్రిస్టియానిటీలోనూ దీని గురించి ప్రస్తావన ఉంది. తాను శాంతి నెలకొల్పేందుకు రాలేదని, ఓ ఆయుధంతో వచ్చాను అని స్వయంగా క్రీస్ట్ చెప్పుకున్నాడు" అని అన్నారు పాటిల్. 2004-08 వరకూ కేంద్రమంత్రిగా పని చేశారు. 1991-96 వరకూ లోక్‌సభ స్పీకర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనతో పాటు శశిథరూర్, దిగ్విజయ సింగ్, పరూక్ అబ్దుల్లా, సుశీల్ కుమార్ శిందే..ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 






వివరణ..


ఈ వ్యాఖ్యలపై దుమారం రేగటం వల్ల పాటిల్ స్పందించారు. తన మాటల వెనక అసలు ఉద్దేశమేంటో వివరించారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి జిహాద్ గురించి చెప్పాడన్న కామెంట్స్‌పై స్పష్టతనిచ్చారు. "శ్రీకృష్ణుడు జిహాద్‌ గురించి చెబుతాడా..? నా మాటల ఉద్దేశం అది కాదు. నేనలా అనలేదు. మహాత్మా గాంధీని చంపితే అది జిహాద్. అలాంటి వాళ్లను చంపటం జిహాద్ కిందకు వస్తుంది" అని చెప్పారు. కానీ...అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. సొంత పార్టీ నేతలే పాటిల్ వ్యాఖ్యలపై సీరియస్‌గా ఉన్నారు. కాంగ్రెస్‌ నేతల్ని కొందర్ని ఈ కామెంట్స్‌పై ప్రశ్నించగా.."అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు" అని స్పందించినట్టు తెలుస్తోంది.