Vijay CID : తెలుగుదేశం పార్టీ నేత చింతకాయల విజయ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చే్యాలని గుంటూరు కోర్టును సీఐడీ అధికారులు ఆశ్రయించారు. చింతకాయల విజయ్ ఐటీడీపీ అధ్యక్షుడిగా ఉంటూ సీఎం సతీమణి అయిన వైఎస్ భారతిపై..భారతీపే అనే క్యూఆర్ కోడ్‌ను తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని దీనిపై కేసు నమోదయిందని సీఐడీ అధికారులు తమ పిటిషన్‌లో తెలిపారు. ఈ కేసు విషయంలో నోటీసులు ఇవ్వడానికి వెళ్తే.. తమను చింతకాయ విజయ్ అనుచరులు అడ్డుకున్నారని తెలిపారు. విచారణకు హాజరు కాలేదని దర్యాప్తును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సీఐడీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ జరపాల్సి ఉంది.
భారతి పే పేరుతో క్యూ ఆర్ కోడ్ తయారు చేశారని చింతకాయల విజయ్‌పై సీఐడీ కేసు
హైదరాబాద్‌లోని చింతకాయల విజయ్ ఇంట్లో ఈ నెల ఒకటో తేదీన ఏపీ సీఐడీ పోలీసులు హల్ చల్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ అపార్టుమెంట్‌లో ఉంటున్న విజయ్ ఇంటికి ఏపీసీఐడీ అధికారుల బృందం వారింటికి వెళ్లింది. ఆ సమయంలో చింతకాయల విజయ్ ఇంట్లో లేరు. పనిమనిషులతో పాటు చిన్న పిల్లలు ఉన్నారు. అయితే వారినే సీఐడీ అధికారులు ప్రశ్నించారని.. ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారని ఆరోపణలు వచ్చాయి. చింతకాయల విజయ్ లేకపోవడంతో ఆయన ఇంట్లో ఉండే పనిమినిషికి నోటీసులు ఇచ్చారు. ఈనెల 6న హాజరుకావాలంటూ 41 సీఆర్పీసీ కింద నోటీసుల్లో పేర్కొన్నారు.
ఆరో తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినా హాజరు కాని విజయ్
అయితే ఆరో తేదీన విజయ్ సీఐడీ విచారణకు హాజరు కాలేదు. విజయ్ తరపున వచ్చిన న్యాయవాదులు తాము తీసుకొచ్చిన లేఖను అందించే ప్రయత్నం చేసారు. అధికారులకు నేరుగా లేఖ ఇచ్చేందుకు విజయ్ తరపు న్యాయవాదులు చాలా సేవు వేచి చూసారు. కానీ, స్పందన రాలేదు. దీంతో.. తపాలా విభాగంలో ఆ లేఖ ఇచ్చి వెళ్లిపోయారు. సీఐడీ పోలీసులు విజయ్ నివాసంలో ఇచ్చిన నోటీసు చెల్లదని ఆయన తరపు న్యాయవాదులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులకు కాకుండా, పనిమనిషిలకు ఇస్తే చెల్లదని వివరించారు.ఆ నోటీసులో కేసు వివరాలు ప్రస్తావించలేదని, భయపెట్టేందుకే ఈ నోటీసులు ఇచ్చారన్నారు. జారీ చేసిన నోటీసుల పైన చింతకాయల విజయ్ సీఐడీకి రాసిన లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. ఎఫ్ఐఆర్ కాపీ, నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు చెప్పాలని విజయ్ లేఖలో కోరారు.
సీఐడీ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం
అయితే ఈ లేఖను సీఐడీ కూడా పరిగణనలోకి తీసుకోలేదు. తాము విచారణకు పిలిచినా హాజరు కావడం లేదని.. దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ చేస్తే.. ఆయనను సీఐడీ అదుబులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే సీఐడీ అధికారుల తీరుపై చింతకాయల విజయ్ కూడా న్యాయపోరాటం చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.