Atmakur Online Nominations :ఆత్మకూరు ఉప ఎన్నికల పక్రియను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసే అవకాశం , అఫిడవిట్ లో వ్యక్తిగత సమాచారాన్ని పొందుపర్చడం సహా అన్ని రకాల ఎన్నికలకు సంబంధించిన అనుమతులను ఆన్‌లైన్‌లో పొందేందుకు  భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు www.suvidha.eci.gov.in  పోర్టల్ ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కోరారు. 


ఆరో తేదీ వరకూ నామినేషన్లు !


ఆత్మకూరుఉప ఎన్నికకు సంబందించి నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 6.  నామినేషన్ల పరిశీలన జూన్ 7 జరుగుతుంది.  ఉప సంహరణకు జూన్ 9  చివరి తేదీ.  జూన్ 23 న ఉదయం 7.00 గంటల నుండి  సాయంత్రం 6.00 గంటల వరకూ ఈ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది.  ఓట్ల లెక్కింపు  జూన్ 26 న నిర్వహిస్తారు.  ఈ ఉప ఎన్నిక ప్రక్రియ మొత్తం  జూన్ 28 లోపు పూర్తిచేయాల్సి ఉంటుందని ముఖేష్ కుమార్ మీనా తెలిాపరు.   జూన్ 6 తేదీ 3.00 గంటల వరకు ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు చేసుకున్న ఓటర్లను కూడా ఈ ఎన్నికలో పరిగణలోకి తీసుకుంటారు. 


నేరచరిత్రను పత్రికల్లో ప్రకటించాలి ! 


ఆత్మకూరు శాసన సభా నియెజక వర్గానికి సంబందించి మే 29 నాటికి మొత్తం 2 లక్షల 16 వేల 5 మంది జనరల్, సర్వీసు ఓటర్లు నమోదు అయ్యారు.  278 పోలింగ్ స్టేషన్లు  ఉన్నాయి..  ప్రతి 1250 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున అదనంగా ఒక  తాత్కాలిక ఆగ్జిలరీ పోలింగ్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేస్తారు.  సుప్రీం కోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు సంబందిత రాజకీయ పార్టీలు కూడా పోటీ చేసే అభ్యర్థి యొక్క క్రిమినల్  కేసుల వివరాలను  ప్రచార కాలంలో మూడు సందర్బాల్లో పలు వార్తాపత్రికలు, టి.వి.చానళ్లల ద్వారా ప్రచారం చేయాల్సి ఉందని ఈసీ ప్రకటించింది.    ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, స్టార్ క్యాంపెయినర్లు కోవిడ్ మార్గదర్శకాలను ఏ మాత్రం అతిక్రమించినా సరే, తదుపరి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించుకొనేందుకు ఎటు వంటి అనుమతులు ఇవ్వబోమని సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టంచేశారు. 


జూన్ రెండో తేదీన విక్రమ్ రెడ్డి నామినేషన్


ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసినా, ఇంకే పార్టీ పోటీ చేసినా.. గెలుపు తమ కుటుంబానిదేనంటున్నారు మేకపాటి తండ్రీ తనయులు రాజమోహన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి. గౌతమ్ రెడ్డి అకాల మరణంతో జరుగుతున్న ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మళ్లీ తమ కుటుంబమే విజయభేరి మోగిస్తుందని చెప్పారు. గౌతమ్ చేసిన కార్యక్రమాలను విక్రమ్ ముందుకు తీసుకెళ్తారని అన్నారు రాజమోహన్ రెడ్డి. ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారాయన. జూన్ 2న నామినేషన్ కి మహూర్తం ఖరారు చేసినట్టు తెలిపారు వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి. ఎంతమంది పోటీ చేసినా వైసీపీ మంచి మెజారిటీ తో గెలుస్తుందని అన్నారు. గడప గడపకి తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నామని, యువతకి అండగా ఉంటామని చెప్పారు. ప్రజల్లో జగన్ ప్రభుత్వానికి పూర్తి ఆదరణ ఉందని అన్నారు.