AP No Special Status :  ఆంధ్రప్రదేశ్ కి   ప్రత్యేక హోదా  లేనట్లేనని.. అది ముగిసిన అధ్యాయమని.. పార్లమెంటు   సాక్షిగా కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. మంగళవారం 
లోక్‌సభలో వైసీపి ఎంపీ లు లావు, బాలశౌరీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం   సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్థిక లోటు భర్తీకి 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించిందన్నారు. దీంతో ప్రత్యేక, ఇతర రాష్ట్రాలకు మధ్య తేడా లేకుండా పోయిందన్నారు. హోదాకు బదులుగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ  ని ప్రకటించామని, ప్యాకేజీ కింద రూ.15.81 కోట్ల నిధులు విడుదల చేశామని నిత్యానందరాయ్ తెలిపారు.


పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా వైసీపీ ఎంపీలు ఏపీ ప్రత్యేకహోదా అంశాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. అది ముగిసిన అధ్యాయం అని కేంద్రం చెబుతూనే ఉంటుంది. 
మైక్య రాష్ట్రాన్ని విభజించినపుడు యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే అప్పట్లో జరిగిన అభివృద్ధి మొత్తం తెలంగాణా ప్రాంతంలోనే కేంద్రీకృతమైంది. పరిశ్రమలు లేక, ప్రభుత్వ రంగ సంస్థలు లేక, రాజధాని కూడా లేని రాష్ట్రంగా అవతరించటం తోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు.   ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ ఈ అంశాన్ని హైలెట్ చేసింది.  ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని 2014 ఎన్నికల్లో   ఇస్తామంది.  ఎన్నికలు ముగిశాక ఆర్థిక సంఘం సిఫార్సుల పేరుతో ఇవ్వలేదు. 
  
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో విభజన హామీల్లో ఒకటైన ప్రత్యేక హోదా డిమాండ్ మరోసారి తెరపైకి వస్తోంది. పాతిక మంది ఎంపీల్ని ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని జగన్ హామీ ఇచ్చారు. అయితే కేంద్రంపై ఎలాంటి పోరాటం చేయలేదు.   ఏపీకి ప్రత్యేక హోదా లేనే లేదని  కేంద్రం చెబుతోంది.  దీంతో రాష్ట్రం కూడా సైలెంట్ అయిపోయింది.   చంద్రబాబు గతంలో ప్యాకేజీ తీసుకోవడంతో హోదా రాకుండా పోయిందని మాత్రమే వైసీపీ సర్కార్, నేతలు విమర్శిస్తున్నారు   ఈ తరుణంలో వైసీపీ నేతల్ని ప్రత్యేక హోదాపై నిలదీయాలని టీడీపీ నేత నారా లోకేష్ తన పాదయాత్రలో కోరుతున్నారు. పాతిక మంది ఎంపీల్ని ఇస్తే హోదా తెస్తానన్న జగన్ ఇప్పుడు 31 మంది ఎంపీలు (లోక్ సభ, రాజ్యసభ కలిపి) ఉన్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారని  టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే  తాము ప్రత్యేకహోదాను లైవ్ లో ఉంచుతున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. 


ప్రత్యేకహోదా వస్తే ఏపీలోని ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందని సీఎం జగన్ చెప్పేవారు. అయితే ఆయన సీఎం అయిన తర్వాత మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందంటున్నారు కానీ.. ప్రత్యేకహోదా సాధిస్తే ప్రతీ జిల్లా హైదరాబాద్ అవడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్న కోణంలో ఆలోచించలేదు. దీన్నే విపక్షాలు అస్త్రంగా చేసుకుంటున్నాయి.