YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ వివేకానందరెడ్డి రాసినట్లుగా చెబుతున్నలేఖకు నిన్ హైడ్రేట్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అనుమతి కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
నిన్ హైడ్రేట్ టెస్ట్ అంటే ఏమిటంటే ?
కాగితం లేదా కార్డ్ బోర్డ్ వంటి వాటిపై ఉపరితలాలపై గుప్త వేలిముద్రలను గుర్తించడానికి నిన్ హైడ్రేట్ టెస్టును నిర్వహిస్తారు. ఇది సాధారణ ఫోరెన్సిక్ టెస్టులకు దొరకని ఆనవాళ్లను కూడా గుర్తిస్తుంది. కొన్ని రసాయనప్రక్రియ ద్వారా ఈ టె్ట్ నిర్వహిస్తారు. అత్యంత నిపుణులు చేసే ఈ టెస్టు ద్వారా.. ఆ లేఖలో ఉన్న వేలి ముద్రలు.. ఇతర గుర్తులన్నింటినీ వెలికి తీసే అవకాశం ఉంది. ఈ టెస్టు నిర్వహించాలని సీబీఐ నిర్ణయించడం ఆసక్తి కరంగా మారింది.
ఇప్పటికే ఫోరెన్సిక్ టెస్ట్ చేయించిన సీబీఐ
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు ఆయనే రాశారంటూ వెలుగులోకి వచ్చిన లేఖ.. ఆయన్ని కొడుతూ.. ఆయన అభీష్టానికి విరుద్ధంగా రాయించినట్లు ఉందని సీబీఐ ఇప్పటికే కోర్టుకు తెలిపింది. తప్పనిసరి పరిస్థితులు, ఇతరుల ఒత్తిడి మధ్య ఆయన ఈ లేఖ రాసినట్లు ఉందని వెల్లడించింది. అందుకే ఆయన చేతిరాత అస్పష్టంగా, గజిబిజిగా కనిపిస్తోందని తెలిపింది. లేఖలోని చేతిరాతను ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలో ఫోరెన్సిక్ సైకలాజికల్ విశ్లేషణ (ఎలాంటి పరిస్థితుల్లో లేఖ రాశారో తెలుసుకోవడానికి) చేయించిన సీబీఐ అధికారులు ఆ సంస్థ నుంచి నివేదిక తీసుకున్నారు. ఈ కేసులో ఇటీవల దాఖలుచేసిన అభియోగ పత్రంతో పాటు న్యాయస్థానానికి సీబీఐ సమర్పించింది.
లేఖపై ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే ?
లేఖలోని చేతిరాతను విశ్లేషిస్తే .. రాసినప్పుడు పెన్ను, మెదడు మధ్య సమన్వయం లేదని రిపోర్ట్‌లో తేలిందని సీబీఐ పేర్కొంది. రాసిన వ్యక్తి సొంతంగా రాసినట్లు అనిపించట్లేదని, తీవ్రమైన ఒత్తిడి, బలప్రయోగం మధ్య రాసినట్లు ఉందని, చేతులు వణుకుతుండగా రాసినట్లు కనిపిస్తోందని, అక్షరాలు క్రమ పద్ధతిలో లేవని చెప్పింది. కాగితంపై పెన్ను ఒత్తిడి ఒక్కోచోట ఒక్కోలా ఉందన్నారు. పదాలు, వరుసల మధ్య పొంతన లేదని, అక్షరాల పరిమాణం అంతా ఒకేలా లేదని తెలిపారు. అక్షరాలు కొన్నిచోట్ల చిన్నవిగా, మరికొన్ని చోట్ల పెద్దవిగా ఉన్నాయని వివరించింది.
సంతకం కూడా సరిపోలలేదు !
వివేకానందరెడ్డి అసలైన సంతకంతో సరిపోల్చి చూసినప్పుడు లేఖలోని సంతకం భిన్నంగా ఉందని నివేదికలో తేలిందని సీబీఐ పేర్కొంది. ఆయన తన సంతకంలో తొలుత ఇంటిపేరు చేర్చి వై.ఎస్.వివేకానందరెడ్డి అని పెడతారని, కానీ లేఖలో వివేకానందరెడ్డి అని మాత్రమే అదీ అస్పష్టంగా ఉందని చెప్పింది. సృహలేని పరిస్థితుల్లో లేఖ రాసినట్లు అనిపిస్తోందని, ఆ లేఖ రాసినప్పుడు ఆయన స్వేచ్ఛగా లేరని.. ఆందోళన, ఒత్తిడి మధ్య ఉన్నారని, లేఖ అసంపూర్తిగా ఉందని చెప్పింది.
మృతదేహం వద్ద దొరికిన లేఖను పట్టించుకోవడం లేదని అవినాష్ రెడ్డి పదే పదే ఆరోపణ!
వివేకా హత్యకు గురైన 2019 మార్చి 15న ఆయన మృతదేహం వద్ద ఓ లేఖ లభించింది. అది ఆయనే రాశారని ప్రచారం జరిగిందని.. అదే రోజు సాయంత్రం కుటుంసభ్యులు దాన్ని పోలీసులకు అందజేశారని అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆ లేఖ కేంద్రంగా విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేఖలో లో ఏముందంటే ‘నా డ్రైవర్‌ను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టాడు. ఈ లేఖ రాయటానికి చాలా కష్టమైంది. డ్రైవర్ ప్రసాద్‌ను వదిలిపెట్టొద్దు. ఇట్లు వివేకానందరెడ్డి’ అని ఆ లేఖలో ఉంది. ఈ లేఖ గుట్టు బయటకు లాగేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది.