Rich Beggar Died :కాకినాడలో ఓ యాచకుడు హఠాత్తుగా చనిపోయాడు. నా అన్నవారు లేరు. దీంతో స్థానికులే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి మున్సిపాలిటీ వారికి సమాచారం ఇచ్చారు. ఆ యాచకుడికి సంబంధించిన సమాచారం ఏమైనా దొరుకుతుందేమోనని ఆయన ఉంటున్న చిన్న గది మొత్తంవెదికారు. అయితే వారికి అలాంటి సమాచారం ఏదీ దొరకలేదు కానీ.. గదిలో ఎక్కడ చూసినా డబ్బులే కనిపించాయి. అన్నీ యాచన చేసి సంపాదించుకున్నవే. రూ. రెండు , లక్షల వరకూ ఉంటాయని గుర్తించారు.
వేళంగికి వచ్చి యాచకునిగా బతుకుతున్న రామకృష్ణ
రామకృష్ణ అనే వ్యక్తి కొన్నాళ్ల కిందట వేళంగి గ్రామానికి వచ్చాడు. నా అనేవాళ్లు ఎవరూ లేకపోవడంతో భిక్షాటన చేసుకుంటూ ఉంటాడు. జనాలకు రక్ష రేకులు కడుతూ ఉంటాడు. దాంతో చాలా మందికి రామకృష్ణ అంటే ముఖ పరిచయం. ఎప్పుడూ కనిపించే వ్యక్తి కాబట్టి... తమ దగ్గర ఉన్నప్పుడు జనాలు పదో పరకో ఇస్తూ ఉండేవారు. అక్కడే చిన్న రూమ్ లో రామకృష్ణ ఉంటూంటాడు. సత్రాల్లోనో.. గుళ్లలోనే ఎక్కడైనా భోజనాలు పెడితే తిని బతుకు ఈడుస్తూ ఉంటాడు.
యాచన చేసిన డబ్బులన్నీ గోతాల్లో భద్రం
చేపల మార్కెట్ సమీపంలో గదిలో ఆయన ఉంటూ ఉంటాడు. అయితే హఠాత్తుగా రామకృష్ణ చనిపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రామకృష్ణకు సంబంధించిన వివరాల కోసం రూమ్‌లో వెదికారు. ఆ వివరాలేమీ దొరకలేదు కానీ.., తనిఖీలో నోట్ల సంచులు వెలుగుచూశాయి. ఆ సంచుల నిండా నోట్ల కట్టలు, చిల్లర నాణేలు ఉన్నాయి. రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో గ్రామస్థులు డబ్బులను లెక్కించారు. మొత్తంగా సుమారు రూ.2 లక్షల వరకు డబ్బు బయటపడింది. ఈ నోట్ల కట్టల సంచులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇప్పుడు రామకృష్ణ బంధువులెవరైనా వస్తారా ?
రామకృష్ణకు డబ్బు అవసరం ఉండేది కాదు. కానీ యాచకం తన వృత్తి అందుకే అలా వృత్తి చేసుకుంటూనే ఉన్నాడు. వచ్చిన డబ్బుల్ని జాగ్రత్త చేసుకుంటూనే ఉన్నాడు. వాటిని ఏం చేసుకోవాలో ఆయనకు తెలియదు. పట్టించుకోలేదు. అయితే అసలు ఇంతకీ రామకృష్ణ ఎవరు ? ఎవరికీ తెలియదు కానీ ఆయనకు సంబంధించిన వాళ్లు ఎక్కడో ఉంటారు. ఆయన భారం భరించలేక వదిలేసి ఉంటారు.కానీ ఇప్పుడు ఆయనకు సంబంధించిన రూ. రెండు లక్షలు పోలీసుల దగ్గర ఉన్నాయని తెలిస్తే వారు రాకుండా ఉంటారా ? వారి కోసమే పోలీసుల వెయిటింగ్.