అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు ( AP HighCourt ) ఇచ్చిన తీర్పు విషయంలో ఏం  చేయాలన్న దానిపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది.   అమరావతి ( Amaravati ) విషయంలో హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి స్టాండ్ తీసుకోవాలన్నదానిపై సీఎం జగన్ సమీక్ష చేశారు. పట్టణాభివృద్ది మంత్రి బొత్స సత్యనారాయణ, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏజీ శ్రీరాం ఈ సమావేశానికి హాజరయ్యారు. సుప్రీంకోర్టుకు (Supreme Court ) వెళ్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందన్న  అంశంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఏం చేయాలన్నదానిపై ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. 


జడ్జిమెంట్ కాపీని ( Judgement ) ఏపీ హైకోర్టు అప్ లోడ్ చేసింది. దాదాపుగా 307 పేజీలున్న తీర్పును ప్రభుత్వ లాయర్ల బృందం అధ్యయనం చేసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లాలా ? వద్దా ?  అన్నదానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  అమరావతి విషయంలో ఇకపై న్యాయపోరాటం చేసినా ఫలితం ఉండదన్న అభిప్రాయం వైఎస్ఆర్‌సీపీలోనే ( YSRCP ) ఎక్కువగా వినిపిస్తోంది. న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తిన్నారన్న చెడ్డ పేరే వస్తుందని భావిస్తున్నారు. అయితే మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గాలని ప్రభుత్వం కూడా అనుకోవడం లేదు. తీర్పు ప్రతిని పూర్తిగా పరిశీలించిన తర్వాత ఏ విధంగా అయినా అవకాశం ఉందేమో పరిశీలించే అవకాశం ఉంది. 


ఏపీ ప్రభుత్వం ( AP Governament ) ముఖ్యంగా సీఎం జగన్ చట్టాలు చేయకుండా ప్రభుత్వాని హైకోర్టు నిర్దేశించిన అంశంపై ఎక్కువగా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. శాసన వ్యవస్థ ఉన్నదే చట్టాలు చేయడానికి అయితే ఆ వ్యవస్థను న్యాయవ్యవస్థ ఎలా నియంత్రిస్తుందని..ఇలా ఉన్నత న్యాయస్థానాల్లో ఎంత వరకు గట్టిగా నిలబడుతుందనే అంశంపై ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ సలహాదారులు రాజ్యాంగ నిపుణుల్ని, సుప్రీంకోర్టు మాజీ  న్యాయమూర్తుల అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అందరి అభిప్రాయాలు క్రోడీకరించిన తర్వాత ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 


శాసన వ్యవస్థను ఓ అంశంపై చట్టం చేయకుండా నిలువరించడం అనేది స్వతంత్ర భారత దేశ చరిత్రలో తొలి సారిగా ఏపీ ప్రభుత్వం ఓ నిర్ధారణకు వచ్చింది. ఇలా చేయడం రాజ్యాంగ సంక్షోభానికి కూడా కారణమవుతుందని అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.