Avanigadda Janasena :   కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఇంటి వద్ద టీడీపీ, జనసేన చేపట్టిన మహాధర్నా హింసాత్మకంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు  ఇంటిని జనసేన,  టీడీపీ  కార్యకర్తలు ముట్టడించారు.  తన ఇంటిని ముట్టడించడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా కర్ర తీసుకుని  జనసేన టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. దీంతో ఎమ్మెల్యేకు జనసేన, టీడీపీ నేతలకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది.  





 


ఎమ్మెల్యే రమేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహారావు జనసేన కార్యాలయం వరకు కర్రలతో వెళ్లి మరీ దాడి చేశారు. వైసీపీ ఎమ్మెల్యే తీరుపై జనసేన, టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు కూడా ఎమ్మెల్యే వ్యవహారంపై మండిపడుతున్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించలేని ఎమ్మెల్యే వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి   అవనిగడ్డ వచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.93 కోట్ల వరాలు కురిపించి నేటికీ సంవత్సరం పూర్తి అయిన నేపథ్యంలో హామీల అమలు ఎప్పుడు ధర్మాకు పిలుపునిచ్చారు. అవనిగడ్డ - కోడూరు" రోడ్డు నిర్మాణం, పాత ఎడ్లలంక బ్రిడ్జి, డయాలసిస్ సెంటర్, పట్టణంలో సీసీ డ్రైన్ నిర్మాణం, దివిసీమ కరకట్ట మరమ్మతులకు  సీఎం జగన్ నిధులు ఇస్తామని ప్రకటించారు. 


 144 వ సెక్షన్ అమలులో ఉందని ధర్నాకు అనుమతులు లేవని పోలీసులు ఇప్పటికే మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సహా నియోజకవర్గ తెలుగుదేశం నేతలకు నిన్ననే నోటీసులు జారీ చేశారు. ఈరోజు బుద్ధప్రసాద్ సహా పలువురు తెలుగుదేశం, జనసేన నేతలను ఇళ్ళ వద్ద నిర్బంధించారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఇంటికి వెళ్ళే అన్ని దారుల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. వందల మందితో కూడిన ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. అయినప్పటికీ కొంత ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వెళ్లి ధర్నా చేయడంతో పరిస్థితి విషమించింది. 


ముఖ్యమంత్రి ఇచ్చిన హమీలు ఇవీ 


అవనిగడ్డలో అక్టోబర్‌ 20, 2022న నిర్వహించిన బహిరంగ సభలో   ఎమ్మెల్యే రమేష్‌ అడిగిన వాటిలో ఒక్కొక్కటి చెబుతూ కోడూరు - అవనిగడ్డ రహదారికి రూ.35 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రజల హర్షద్వానాల మధ్య సీఎం జగన్‌ ప్రకటించారు. ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు.  సముద్ర కరకట్ట, కృష్ణానది కుడి, ఎడమ కరకట్టల అభివృద్ధికి రూ.25 కోట్లు, పాత ఎడ్లంక కృష్ణా నది పాయపై వంతెన నిర్మాణానికి రూ.8.5 కోట్లు, అవనిగడ్డలో పక్కా డ్రెయినేజీ నిర్మాణానికి రూ.15 కోట్లు, అవనిగడ్డలో కొత్తగా కంపోస్టు యార్డు ఏర్పాటుకు రూ.8 కోట్లతో పాటు అత్యంత ముఖ్యమైన డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటుకు హామీ ఇస్తూ ప్రకటించారు. ఇవేమీ అమలు కాలేదు.