Tenali Woman Geetanjali Suicide: తెనాలిలో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. గీతాంజలి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇటీవల గీతాంజలి తనకు జగనన్న కాలనీలో ఇళ్లు మంజూరు కావడం పట్ల, అమ్మఒడి పధకం ద్వారా లబ్ధి పొందడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. కానీ ఆ విషయం వైరల్ కావడంతో.. భరించలేని టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు ఆమెను కాకుల్లా పొడిచి ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశాయని ఆరోపించారు. సోషల్ మీడియాలో ట్రోల్స్, వేధింపులు భరించలేక చివరికి ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేశారంటూ మండిపడ్డారు. గీతాంజలి ఆత్మహత్యకు కారకులైన వారిపై చట్టం కఠిన చర్యలు తీసుకుంటుందని, ఆమె కుటుంబానికి అన్ని విధాలా వైసీపీ అండగా నిలుస్తుందన్నారు. ఆ మహిళ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వైసీపీ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.






గీతాంజలి కుటుంబాన్ని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్  పరామర్శించారు. జగన్ ప్రభుత్వం నుంచి పథకాలు వచ్చాయి అని మీడియాతో సంతోషంగా చెప్పినందుకు అమాయకురాలిని టీడీపీ , జనసేన సోషల్ మీడియా ద్వారా దారుణంగా ట్రోల్ చేసి ఆత్మహత్య చేసుకునేలా చేశాయని ఆరోపించారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు చేసిన మానసిక దాడి అత్యంత బాధాకరం అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ప్రభుత్వం తరుపున అన్ని విధాల ఆదుకుంటాం. బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. 






గీతాంజలి ఆత్మహత్యపై టీడీపీ స్పందించింది. సీఎం వైఎస్ జగన్ సిద్ధం సభ అట్టర్ ప్లాప్ కావడంతో, జనం దృష్టిని మరల్చడానికి వైసీపీ పేటీఎం బ్యాచ్ మరో ఫేక్ ప్రచారానికి దిగిందన్నారు. అప్పటికప్పుడు లోకేష్ పేరు మీద ఫేక్ పోస్టులు సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారని.. రాష్ట్ర ప్రజలు ఇలాంటి ఫేక్ ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండండాలని ఎక్స్‌లో టీడీపీ పోస్ట్ చేసింది. 






ఆ పోస్ట్‌లో ఏముందంటే.. 
‘టీడీపీ సోషల్ మీడియా దెబ్బకు గీతాంజలి అనే పేటీఎం మహిళ చనిపోయింది. ఇంకోసారి జగన్ ను పొగిడితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఇళ్ల పట్టా ఇస్తే మడిచి పెట్టుకోండి. అంతేగానీ మైకు ముందుకొచ్చి అరవకండి. తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా సైన్యం తెగిస్తే మీరు తట్టుకొని నిలబడలేరు’ అని నారా లోకేష్  పేరిట తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ వైరల్ అయింది. కానీ అది ఫేక్ పోస్ట్ అని, లోకేష్ ట్విట్టర్ అకౌంట్ కాదని అని టీడీపీ క్లారిటీ ఇచ్చింది.