తెలుగుదేశం పార్టీ నేతలకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. తమ నియోజకవర్గాల్లో కాకుండా ఇతర చోట్ల పార్టీ అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఇలాంటి వాటిని సహించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పార్టీ బాధ్యతలు అప్పగించిన ప్రాంతాలలో కాకుండా ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడం.. ఇష్టానుసారం పార్టీని, పార్టీ నాయకులను విమర్శించడం, పార్టీకి సంబంధం లేని నాయకులను కలవడం లాంటి చర్యలకు పాలపడుతున్నారని .. ఇలాంటి వారిని క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు.
హఠాత్తుగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇలాంటి లేఖ విడుదల చేయడం టీడీపీ వర్గాల్లోనే చర్చకు కారణం అవుతోంది. ప్రధానంగా అనంతపురం జిల్లా టీడీపీ నేతలను ఉద్దేశించి ఈ హెచ్చరికలను చేసినట్లుగా భావిస్తున్నారు. ఎందుకంటే శుక్రవారం అనంతపురం టౌన్ టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ అసలు ఆయనకు సంబంధం లేదు. కానీ తన స్వచ్చంద సంస్థ పేరుతో ట్రై సైకిళ్ల పంపిణీ కోసం అక్కడకు వెళ్లారు. దీనిపై టీడీపీ హైకమాండ్‌కు ఫిర్యాదులు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
Also Read : అమరావతిలో పవన్‌ను కలిసిన అగ్రనిర్మాతలు ! ఒంటరిని చేయలేదని క్లారిటీ ఇచ్చారా?
అదే సమయంలో జేసీ బ్రదర్స్ కూడా అనంతపురం నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటూ ఉంటారు. ప్రభాకర్ చౌదరిపై విమర్శలు చేస్తూ ఉంటారు. ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీ తీరుపై నేరుగా విమర్శలు చేశారు. వైఎస్ఆర్ సీపీ నాయకులతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు గుప్పించారు. ఆ తర్వాత ప్రభాకర్ చౌదరి కూడా జేసీ బ్రదర్స్ వల్ల టీడీపీ చాలా నష్టపోయిందని విమర్శలు చేశారు. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితుల్లో సందర్భం లేకపోయినా తాడిపత్రిలో ప్రభాకర్ చౌదరి పర్యటించడం కలకలం రేపింది.
Also Read : అనంత టీడీపీలో మరోసారి కలకలం.. తాడిపత్రిలోకి ప్రభాకర్ చౌదరి ఎంట్రీ !
అయితే అన్నింటినీ ఆవేశంగా డీల్ చేసే ప్రభాకర్ రెడ్డి ఈ విషయంలో సంయమనంతోనే ఉన్నారు. ఆయన ఈ రోజంతా తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లుల విషయంలో పెద్ద వడుగూరు మండలపరిషత్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నారు. ప్రభాకర్ చౌదరి వ్యవహారాన్ని ఆయన టీడీపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ రోజు రోజుకు తీవ్రమవుతూండటంతో జాగ్రత్తగా ఉండాలని అచ్చెన్నాయుడు హెచ్చరికలు జారీ చేసినట్లుగా భావిస్తున్నారు.
Watch Video : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరి కోసం? పార్టీ కోసమా? సినీ పరిశ్రమ కోసమా?