At Home Event In Telugu States Rajbhawan: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజ్ భవన్‌లో 'ఎట్ హోం' కార్యక్రమం ఘనంగా సాగింది. ఆదివారం సాయంత్రం విజయవాడలోని రాజ్ భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు (CM Chandrababu), ఆయన సతీమణి భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు నారా లోకేశ్, నారాయణ, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, సవిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎస్, డీజీపీ, ఇతర సీనియర్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్యనేతలు హాజరయ్యారు. ఆహ్లాదకర వాతావరణంలో ఈవెంట్ సాగింది.
అటు, తెలంగాణలోని రాజ్ భవన్‌లో నిర్వహించిన 'ఎట్ హోం' కార్యక్రమం ఆహ్లాదంగా సాగింది. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
సీఎం రేవంత్ వీడియో సందేశం
ప్రజా పాలనలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొత్త పథకాల ప్రారంభం సందర్భంగా ప్రజలకు వీడియో ద్వారా సందేశమిచ్చారు. రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఈ వీడియో సందేశాన్ని గ్రామసభల్లో ప్రదర్శించినట్లు అధికారులు తెలిపారు.