Telangana CM Revanth Reddy Launched Four New Welfare Schemes: రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. నారాయణపూర్ జిల్లా (Narayanpur District) కోస్గి మండలం చంద్రవంచలో జరిగిన కార్యక్రమంలో కొత్త పథకాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ, ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభిస్తూ.. లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. మొత్తం 734 మందికి రైతు భరోసా చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రూ.11.80 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశారు.
'అర్ధరాత్రి దాటాక డబ్బులు జమ'
సాగు ఖర్చులు పెరిగాయని.. రైతు భరోసా (Rythu Bharosa) నిధులు పెంచామని సీఎం రేవంత్ తెలిపారు. ఏడాదికి ఎకరాకు రూ.12 వేల చొప్పున ఇస్తున్నామని.. ఇవాళ ఆదివారం కాబట్టి, రైతు భరోసా డబ్బులు జమ కావని చెప్పారు. అర్ధరాత్రి 12 దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. 'అప్పట్లో ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్క సంతకంతో దేశమంతా రుణమాఫీ చేశారు. ఇప్పుడు ఒకే విడతలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశాం. ఇలా రుణమాఫీ చేసిన రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. దాదాపు 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.21 వేల కోట్లు వేశాం. భూమి లేని వారిని కూడా ఆదుకోవాలని గతంలో కూలీలు అడిగారు. భూమి లేని వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకువచ్చాం. ఈ పథకం కింద రూ.12 వేలు ఇస్తున్నాం.' అని వివరించారు.
'ప్రజల వద్దకు ప్రభుత్వం'
గతంలో ఏదైనా కావాలంటే, ఎవరైనా ఫామ్‌హౌస్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని.. ఇప్పుడు ప్రజల దగ్గరకే ఎమ్మెల్యేలు, అధికారులు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 'గ్రామాల్లో ప్రజల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం. ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటోంది. గడిచిన పదేళ్లలో పేదలకు ప్రభుత్వం ఇళ్లు రాలేదు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాం. పేదలు ఇల్లు నిర్మించుకుంటే రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నాం. రేషన్ కార్డు ఉన్న పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తాం. గ్రామసభల ద్వారా రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాం. అధికారులను గ్రామాలకు పంపిస్తున్నాం. ప్రజా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది.' అని రేవంత్ పేర్కొన్నారు.
'మాటిస్తే వెనక్కి తగ్గం'
కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే.. ఎప్పటికీ వెనక్కి తగ్గదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. 'పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలింది. ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తే.. ప్రజలను రెచ్చగొడుతున్నారు. మన ప్రజలకు ఉపాధి కోసం పరిశ్రమలు తేవాలని భావించాను. మాయమాటలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి పరిశ్రమలు అడ్డుకుంటున్నారు.' అని రేవంత్ పేర్కొన్నారు.
Also Read: Viral News: మహిళ ఇంటి ముందు బ్యాంక్ అధికారుల వినూత్న నిరసన, వంటావార్పుతో అంతా షాక్