Temples Rush in Telugu States Due to Karthikam: తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్య క్షేత్రాలు కార్తీక శోభతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం (Karthika Masam) మొదటి సోమవారం కావడంతో వేకువజాము నుంచే భక్తులు పుణ్య నదుల్లో స్నానాలు ఆచరించి ఆలయాలకు పోటెత్తారు. భీమవరం పంచారామ క్షేత్రం, శ్రీశైలం (Srisailam), రాజమహేంద్రవరం (Rajamahendravaram), విజయవాడ, శ్రీకాళహస్తి, భద్రాచలం, వేములవాడ తదితర ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది. శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదుల్లో పుణ్య స్నానాల అనంతరం మహిళలు దీపాలు వెలిగించారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్, కోటిలింగాల ఘాట్ వద్ద భక్తుల సందడి నెలకొంది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో ప్రధాన ఆలయాలు మార్మోగుతున్నాయి.
శ్రీశైలంలో రద్దీ
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక తొలి సోమవారాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్నానఘాట్లు, ఆలయం ఎదుట గంగాధర మండపం, ఆలయ ఉత్తర మాఢవీధుల్లో భక్తులు కార్తిక దీపారాధన చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయాల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
జన సంద్రంగా గోదారి తీరం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి తీరం భక్త జన సంద్రంగా మారింది. నదిలో మహిళలు అధిక సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను నీటిలో వదిలారు. అనంతరం ఒడ్డున ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. అటు, హన్మకొండ జిల్లాలోని వేయి స్తంభాల ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.