Praveen Prakash Angry on Nellore District Education Officers: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారి గంగాభవాని, కందుకూరు ఉప విద్యాశాఖాధికారి శ్రీనివాసులపై రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన లింగసముద్రం మండలం మొగిలిచర్ల ఉన్నత పాఠశాలను తనిఖీ చేయగా, పలు సమస్యలున్నట్లు గుర్తించారు. వీటిపై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తూ, 'నేను ఆర్డర్ వేస్తే, అంతర్జాతీయ కోర్టులోనూ స్టే రాదు. ఏమనుకుంటున్నారో మీ ఇష్టం.' అంటూ వ్యాఖ్యానించారు. 


'ఆరుగురికే ఇంగ్లీష్ పుస్తకాలా.?'


పాఠశాలలో 25 మంది విద్యార్థులుంటే ఆరుగురికే ఇంగ్లిష్ పుస్తకాలుండడంపై ప్రవీణ్ ప్రకాష్ విస్మయం వ్యక్తం చేశారు. విద్యార్థుల అసైన్మెంట్లు సైతం సరిగా లేవంటూ మండిపడ్డారు. 'నవంబర్ 25 నుంచి అర్ధ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికీ 80 శాతం సిలబస్ పూర్తి కాలేదు. విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలు ఎలా పెరుగుతాయి.? వారు పరీక్షలు ఎలా రాస్తారు.?' అంటూ అధికారులను నిలదీశారు. ఒక్కో అధికారి రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ, పాఠశాలలను సరిగ్గా పర్యవేక్షించడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప విద్యాశాఖాదికారిపై చర్యలు తీసుకోవాలని డీఈవో గంగాభవానిని ఆదేశించారు. లేకుంటే ఆమెను డిమోట్ చేస్తామని హెచ్చరించారు.


అధికారులపై అసహనం


ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి, జగనన్న గోరుముద్ద వంటి పథకాలు అధికారుల నిర్లక్ష్యంతో ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయని ప్రవీణ్ ప్రకాష్ మండిపడ్డారు. ఏ స్కూల్ లోనైనా 85 శాతం మంది పిల్లలు బాగా చదివే వారుంటారని, మిగిలిన 15 శాతం మంది పిల్లలు కాస్త వెనుకబడి ఉంటారని, అయితే ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే అనుభవం ఉన్న సీఆర్పీలను నియమించి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఏపీసీ ఉషారాణిని ఆదేశించారు. ఉపాధ్యాయుల పని తీరుపైనా అంసతృప్తి వ్యక్తం చేసిన ఆయన, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిర్దేశించారు. అనంతరం గంగపాలెం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన ఆయన, మూడో తరగతి విద్యార్థుల పుస్తకాలు సరిగా లేకపోవడంపై ఎంఈవో - 2 శివకుమార్, హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు.


Also Read: Vijayawada News: జాతీయ రహదారిపై కార్ల రేసింగ్ - ముక్కలైన స్కూటీలు, గాల్లోకి ఎగిరిపడ్డ యువకులు