TDP MLAs Suspension:   అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. సభలో ఉన్న పదహారు మంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పీకర్‌ను కోరారు.  టీడీపీ నేతలు సభను ఉద్దేశపూర్వకంగా జరగనీయకుండా చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి  విమర్శించారు. పరిపాలనా వికేంద్రీకరణపై చర్చ జరుగుతుందని దీన్ని అడ్డుకోవడం సరికాదని, సభ సజావుగా జరగడానికి టీడీపీ సభ్యులు సహకరించడంలేదని బుగ్గన పేర్కొంటూ టీడీపీ సభ్యులు అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, వెంకటరెడ్డి, సీవీ జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్ రావు, రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంచల రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయ స్వామి తదితరులను సభ నుంచి సప్పెండ్ చేయాల్సిందిగా బుగ్గను సభాపతికి సూచించారు. దీంతో తమ్మినేని సీతారాం ఒక రోజు సభ నుంచి టీడీపీ నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.


పరిపాలనా వికేంద్రీకరణపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. ఈ చర్చలో తెలుగుదేశం పార్టీ తరపున నిమ్మల రామానాయుడు మాట్లాడారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో రాజధాని ప్రకటన రాక ముందే సభలో ఉన్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ భూములు కొన్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన పయ్యావుల కేశవ్.. తాను భూములు కొన్నది రాజధాని ప్రకటన తర్వాతేనన్నారు. తన విషయంలో తప్పు ఉంటే బినామీ చట్టం ఉపయోగించి భూములు స్వాధీనం చేసుకోవచ్చని సవాల్ చేశారు. ఈ సందర్భంగా అమరావతి భూముల విషయంలో ప్రభుత్వం  ఇప్పటి వరకూ చేసిన ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేదని ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో వేసిన కేసుల్ని ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించారు. 


రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే ధైర్యం కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదని మండిపడ్డారు. పయ్యావుల విమర్శలపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అమరావతి ప్రకటన రాక ముందే  టీడీపీ నేతలు భూములు కొన్నారని... అక్కడ భూములన్నీ కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయన్నారు. పాదయాత్ర చేస్తున్న వాళ్లెవరుూ రైతులు కాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో పయ్యావులపై మరిన్ని ఆరోపణలు చేయడంతో.. వివరణ ఇచ్చే అవకాశాన్ని పయ్యావులకు ఇవ్వాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. నినాదాలు చేశారు. 


పాలనా వికేంద్రీకరణపై చర్చ జరగకుండా ఇలా నినాదాలు చేస్తున్నందున టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయాలని సభా వ్యవహారాల మంత్రి కూడా  అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పీకర్‌కు విజ్ఞప్తి  చేశారు. తమ వాయిస్ వినిపించకుండా ..గొంతు నొక్కేందుకేసస్పెండ్ చేశారని టీడీపీ సభ్యులు మండిపడ్డారు.  ఈ ఒక్క రోజుకే సస్పెన్షన్ వేటు విధించడంతో మళ్లీ రేపట్నుంచి టీడీపీ సభ్యులు సభకు  హాజరు కానున్నారు.  అసెంబ్లీ మరో నాలుగు రోజుల పాటు సాగనుంది.