Breaking News: బెయిల్ పై చింతమనేని ప్రభాకర్ విడుదల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఆగస్టు 30న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 30 Aug 2021 03:06 PM
ఢిల్లీకి తెలంగాణ సీఎం కేసీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. సెప్టెంబ‌ర్ 1న మ‌ధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బ‌య‌ల్దేర‌నున్నారు. 2వ తేదీన మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యానికి కేసీఆర్ భూమి పూజ చేయ‌నున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌స‌భ‌, రాజ్యసభ స‌భ్యులు, పార్టీ నాయ‌కులు పాల్గొన‌నున్నారు.  సెప్టెంబ‌ర్ 3న మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌కు సీఎం కేసీఆర్ తిరిగి బ‌య‌ల్దేర‌నున్నారు.

బెయిల్ పై చింతమనేని ప్రభాకర్ విడుదల

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‍ను దెందులూరు పోలీసులు బెయిల్ పై విడుదల చేశారు. అనంతరం ఆయన స్వగ్రామం పెదవేగి మండలం దుగ్గిరాల చేరుకున్నారు. నిన్న ఆయన్ను చింతపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజీల్ ధరల పెంపుపై టీడీపీ నిరసనలు చేపట్టింది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో పెట్రో ధరలపై నిర్వహించిన ధర్నాలో చింతమనేని పాల్గొన్నారు. ఈ ధర్నా విషయమై పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లా చింతపల్లి పోలీసులు చింతమనేనిని అరెస్టు చేశారు. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరుకు తరలించారు. 


 

అగ్రి ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించిన కేటీఆర్

రాజేంద్ర నగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్మించిన అగ్రీ ఇన్నోవేషన్ హబ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తర్వాత అందులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌, ఉత్పత్తులను పరిశీలించారు. రూ.9 కోట్ల నాబార్డ్‌ నిధులతో దీనిని నిర్మించారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇది అందించనుంది. అగ్రిహబ్‌లో 14 స్టార్టప్‌ కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఈ కార్యక్రమంలో నాబార్డ్‌ చైర్మన్‌ గోవిందరాజులు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ... తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని నిలువరించాలని వినతి

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. విద్యుత్ ఉత్పత్తి చేయకుండా తెలంగాణను నిలువరించాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. విద్యుత్ ఉత్పత్తిపై ఏపీకి సమాచారం లేదని పేర్కొంది. సాగునీటి కోసం ఏపీ ఇండెంట్‌ ఉంటేనే విద్యుదుత్పత్తికి ఆస్కారం ఉందని పేర్కొంది. శ్రీశైలం, సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నందున అనుమతి అవసరమని తెలిపింది. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేేస్తుందని లేఖలో పేర్కొంది.  కృష్ణా డెల్టాలో నీటి అవసరాలపై ఏపీ ఇండెంట్ ఇస్తేనే నీటి విడుదలకు ఆస్కారం


 

బీజేపీ ఎప్పటికీ టీఆర్ఎస్‌తో కలవదు: బండి సంజయ్

బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజు సందర్భంగా ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పేరు మార్చేసి రెండు పడక గదుల ఇళ్లంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేరు మార్చేసిందని వ్యాఖ్యానించారు. పేదలకు ఇళ్లు కట్టట్లేదు కానీ, కేసీఆర్ మాత్రం వంద గదులతో ప్రగతి భవన్ నిర్మించుకున్నారని సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎప్పటికీ టీఆర్ఎస్‌తో కలిసి పోటీ చెయ్యబోదని తేల్చి చెప్పారు.

కారు కొట్టుకుపోయిన ఘటనలో మృత దేహాలు లభ్యం

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్‌లో వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో తాజాగా మృత దేహాలు లభ్యమయ్యాయి. పెళ్లి బృందం ఉన్న ఈ కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో నవ వరుడు నవాజ్ రెడ్డి, ఆయన సోదరి క్షేమంగా బయటపడ్డారు. తాజాగా నవ వధువు ప్రవల్లిక, శ్వేత, డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి మృతదేహాలను వెలికితీశారు. మరో బాలుడు 8 ఏళ్ల ఇషాంత్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. ఈ నెల 26న రావులపల్లికి చెందిన నవాజ్‌ రెడ్డికి మోమిన్ పేటకు చెందిన ప్రవల్లికతో వివాహం జరిగింది. మోమిన్‌ పేటకు వెళ్లి వస్తుండగా తిమ్మాపూర్ వాగు వద్ద రోడ్డుపై నీరు పారుతుండగా వద్దని వారించినా వినకుండా కారు ముందుకు పోనివ్వడంతో ఈ ప్రమాదం జరిగింది.

తిరుమలలో సంప్రదాయ భోజనాన్ని నిలిపివేస్తున్నాం : వైవీ సుబ్బారెడ్డి

తిరుమలలో సంప్రదాయ భోజనంపై టీటీడీ వెనక్కి తగ్గింది. సంప్రదాయ భోజనంపై సోషల్‌ మీడియాలో‌ దుష్ప్రచారం తగ్గదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్న ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. టీటీడీ పాలక మండలి లేని సమయంలో మంచి ఉద్దేశంతో అధికారులు సంప్రదాయ భోజనం ప్రవేశపెట్టారన్నారు.  అయితే సంప్రదాయ భోజనంపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే నేటి నుంచి సంప్రదాయ భోజనాన్ని నిలిపివేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.


కృష్ణాష్టమి సందర్భంగా తిరుమలలో నూతన సేవకు శ్రీకారం చుట్టబోతున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నవనీత సేవ కార్యక్రమాన్ని ఇవాల్టి నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. టీటీడీలో ఇప్పటికే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే గుడికో గోమాత, గోపూజ, గోవిందునికి గోధారిత నైవేద్యం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.


నవనీతసేవ లాంటి ఒక కొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. శ్రీవారి నైవేద్యం, కైంకర్యాలకు కావాల్సిన పదార్ధాలు సంప్రదాయబద్ధంగా గోవు పాలు,నెయ్యిని, వెన్నను సేకరించి అందిస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో ఏ ఆహారమైన స్వామి వారి ప్రసాదంగానే అందించాలని అందుకే సంప్రదాయ భోజనాన్ని నిలిపి వేస్తూ నిర్ణయం‌ తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో సర్వదర్శనాలపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 

డోన్ పట్టణంలో దొంగలు హల్ చల్... ఎస్బీఐ ఏటీఎంలో చోరీ

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో దొంగలు హల్ చల్ చేశారు. పట్టణంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీ చేశారు. ఏటీఎంలో  గ్యాస్ కట్టర్, గడ్డపారాల సహాయంతో  రెండు మిషన్లలో దొంగిలించారు. ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఏటీఎంలో ఎంత నగదు అపహరణకు గురైందన్న విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

పారాలింపిక్స్ లో భారత్ కు స్వర్ణం

టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు బంగారు పతకం దక్కింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఫైనల్  లో అవని లేఖారా విజయం సాధించింది. ఫైనల్ లో ఆమె 249.6 స్కోర్ చేసింది. ఇది ప్రపంచ రికార్డు. పారాలింపిక్స్ లో భారత్ కు ఇది నాలుగో పతకం. 






 





 

బైక్ ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఇద్దరు మృతి

కడప జిల్లా రైల్వే కోడూరులో రోడ్డు ప్రమాదం జరిగింది.  బైక్ ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు కోడూరుకు చెందిన రెడ్డయ్య, కొండయ్యగా పోలీసులు గుర్తించారు.

Background

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. రోడ్డుపై పడి ఉన్న గేదె కళేబరంపై ఆటో ఎక్కడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వాళ్లను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 14 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బెస్తవారిపేట మండలం కొత్తపల్లిలో కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.