Telangana Highcourt :  వైఎస్ వివేకా కేసులో  సీబీఐకి తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేశారని.. రికార్డుల నుంచి తొలగించాంటూ అజేయకల్లాం దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్‌ను విచారణకు తీసుకునే అంశంపై పలు సాంకేతిక తప్పిదాలను రిజిస్ట్రార్ వ్యక్తం చేశారు. అయితే రిజిస్ట్రార్ అభ్యంతరాలను తోసి పు్చ్చిన హైకోర్టు న్యాయమూర్తి పిటిషన్ విచారణకు అనుమతించారు. పిటిషన్‌కు మెయిన్ నెంబర్ కేటాయించాలని ఆదేశించారు. 


గతంలో అజేయకల్లాం వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ                           


వివేకా హత్య కేసులో మాజీ ఐఏఎస్ అజేయ కల్లం వద్ద సీబీఐ వాంగ్మూలం నమోదు  చేసింది.  ఈ వాంగ్మూలాన్ని సీబీఐ కోర్టుకు సమర్పించింది.   సీబీఐ పేర్కొన్న స్టేట్‌మెంట్‌లో అన్నీ అబద్ధాలే ఉన్నాయని ఆ వాంగ్మూలాన్ని తొలగించాలని  అజేయ కల్లం హైకోర్టులో పిటిషన్ వేశారు.  ఏప్రిల్‌ 29, 2023న సీబీఐ తన నుంచి స్టేట్‌మెంట్‌‌ను రికార్డు చేసిందని తెలిపారు. తాను చెప్పింది ఒకటైతే సీబీఐ దాన్ని మార్చి చార్జిషీటులో మరోలా పేర్కొందని అజేయకల్లం పిటిషన్‌లో వెల్లడించారు. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని ఆయన కోరారు.


పిటిషన్‌లో  పలు అంశాలు చెప్పిన అజేయకల్లం                                        


అసలు వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందో.. దానినే సీబీఐకి వివరించినట్టు అజేయ కల్లం పిటిషన్‌లో వివరించారు.  ‘‘మార్చి 15, 2019న జగన్‌ నివాసంలో ఉదయం మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైంది. సమావేశం మొదలైన గంటన్నర తర్వాత అటెండర్‌ వచ్చి డోరు కొట్టారు. ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌గారికి ఏదో విషయం చెప్పారు. వెంటనే జగన్‌ షాక్‌కు గురైనట్టుగా లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారు. ఇంతకు మించి నేనేమీ సీబీఐకి చెప్పలేదు’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే సీబీఐ తన చార్జిషీటులో దీన్ని మొత్తాన్ని మార్చివేసిందన్నారు. తానసలు జగన్ భార్య ప్రస్తావన కానీ.. మరే ఇతర ప్రస్తావన కానీ సీబీఐ విచారణలో తీసుకురాలేదన్నారు. సీబీఐ తాను చెప్పినట్టుగా పేర్కొన్న చార్జిషీట్‌లో అన్నీ అబద్ధాలే ఉన్నాయన్నారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించే ధోరణి ఇందులో కనిపిస్తోందన్నారు. తన విజ్ఞాపనను పరిగణలోకి తీసుకుని ఛార్జిషీటులో తన స్టేట్‌మెంట్‌గా పేర్కొన్నారని అజేయ కల్లాం వాదిస్తున్నారు. 


ఆగిన వివేకా హత్య కేసు దర్యాప్తు                           


ప్రస్తుతానికి వివేకా  హత్య కేసు దర్యాప్తు ఆగిపోయింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మేరకు విచారణ జరిపి చార్జిషీట్లు దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ పొందిన అవినాష్ రెడ్డి తప్ప నిందితులు అందరూ జైల్లో ఉన్నారు.