Telangana Governor Meet AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో (Chandrababu) తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ (Radhakrishnan) శుక్రవారం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చిన గవర్నర్‌కు చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురూ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. వీరి భేటీకి ముందు మంత్రి నారా లోకేశ్ గవర్నర్‌కు స్వాగతం పలికి.. శాలువాతో సత్కరించారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న గవర్నర్‌కు.. విమానాశ్రయంలో అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్లారు.






'అలాంటి చర్చ జరగలేదు'


కాగా, సుమారు 2 గంటల పాటు భేటీ అనంతరం గవర్నర్ రాధాకృష్ణన్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలకగా.. పూర్ణకుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం పండితులు గవర్నర్‌కు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఈవో కేఎస్ రామారావు అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రాన్ని ఆయనకు అందించారు. కాగా, ఏపీ సీఎం చంద్రబాబును మర్యాద పూర్వకంగానే కలిశానని.. విభజన సమస్యలపై ఎలాంటి చర్చా జరగలేదని గవర్నర్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుకు అభివృద్ధిపై పూర్తి అవగాహన ఉందని.. ప్రత్యేకంగా ఎలాంటి అంశాలు తమ మధ్య చర్చకు రాలేదని చెప్పారు. అమ్మవారిని దర్శించుకుందామనే విజయవాడ వచ్చానని.. దర్శనం అద్భుతంగా జరిగిందని వెల్లడించారు.


Also Read: PV Narasimha Rao: 'ఆర్థిక భాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి' - మాజీ ప్రధాని పీవీకి తెలుగు రాష్ట్రాల సీఎంల ఘన నివాళి